అక్రమ సంబంధానికి రెండు నిండు ప్రాణాలు బలి
విశ్వంభర, బిజినపల్లి: భర్త ఉన్నా మరొకరితో చనువుగా తిరుగుతూ తన చావుతోపాటు భర్త మరణానికి కారణమైంది ఓ ఇల్లాలు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ విషాద ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బిజినపల్లి మండలం ముంగనూరు గ్రామానికి చెందిన సంఘనమోని వెంకటయ్య (45)కు ఇద్దరు భార్యలు. వారికి ఐదుగురు సంతానం. కాగా, వెంకటయ్య రెండో భార్య తారకమ్మ (34) అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో చనువుగా మెలుగుతుంది. దీంతో ఆ కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు గ్రామపెద్దల సమక్షంలోనే పంచాయితీలు జరిగాయి. తారకమ్మను పద్ధతి మార్చుకోవాలని కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు హెచ్చరించారు. అయినా ఆమె అదే పనిగా మరోవ్యక్తితో చనువుగా మెలగడం కొనసాగించింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని వెంకటయ్య గురువారం రాత్రి రెండు గంటల సమయంలో తారకమ్మ నిద్రపోతున్న సమయంలో ఆమె తలను బండకేసి కొట్టడంతో తల పగిలి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. అది గమనించిన వెంకటయ్య భయాందోళనకు గురై గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాలకు చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి తమ్ముడు రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగశేఖర రెడ్డి తెలిపారు.