కోర్టులోనే కన్నీళ్లు పెట్టుకున్న స్వాతి మలివాల్
రాజ్యసభ ఎంపీ, ఆప్ నేత స్వాతి మలీవాల్‌పై వేధింపులు, దాడి కేసును సోమవారం ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు విచారణ జరిపింది. విచారణ జరుగుతుండగా స్వాతి మలీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. లాయర్ వాదనలతో కోర్టులోనే ఉన్న స్వాతి కన్నీళ్లు పెట్టుకున్నారు.
రాజ్యసభ ఎంపీ, ఆప్ నేత స్వాతి మలీవాల్‌పై వేధింపులు, దాడి కేసును సోమవారం ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో అరెస్టు చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌కు కోర్టు నాలుగు రోజుల కస్టడీ విధించిన విషయం తెలిసిందే. స్వాతి తనకు తానే గాయపరుచుకుందేమోనని బిభవ్ తరఫు న్యాయవాది హరిహరన్ వాదించారు.
ఆమెపై దాడి చేయాలని లేదా వేరే ఏ ఇతర ఉద్దేశం బిభవ్‌కు లేదని ఆయన కోర్టులో తెలిపారు. అనేక మంది ఉండే సీఎం నివాసంలో దాడి జరిగే అవకాశం ఉండదని, బిభవ్‌కు బెయిల్ ఇవ్వాలని కోరారు. విచారణ జరుగుతుండగా స్వాతి మలీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. లాయర్ వాదనలతో కోర్టులోనే ఉన్న స్వాతి కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆదివారంతో కస్టడీ గడువు ముగియడంతో సోమవారం బిభవ్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరుగుతుండగా ఓ మహిళా కానిస్టేబుల్ స్పృహ కోల్పోవడంతో కోర్టులో కలకలం రేగింది. ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండ తీవ్రతకు కానిస్టేబుల్ స్పృహ కోల్పోయినట్లు సమాచారం. ఈ నెల 18న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి జరిగిందని ఎంపీ స్వాతి మలీవాల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.