నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి..!
గురువారం తెల్లవారుజామున 3:40 గంటలకు ఓ విద్యార్థిని బాత్‌రూం వెళ్లేందుకు బయటకు రాగా కారుణ్య కళాశాల ఆవరణలో రక్తపుగాయాలతో పడి ఉంది. గమనించిన తోటి విద్యార్థినులు హాస్టల్ వార్డెన్‌కు తెలిపారు.
భద్రాచలంలో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితితో మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కొణిజర్ల మండలం సిద్ధిక్‌నగర్‌కు చెందిన పగిడిపల్లి కారుణ్య (17) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణం కూనవరం రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ ఫస్టియర్ చదువుతోంది.
గురువారం తెల్లవారుజామున 3:40 గంటలకు ఓ విద్యార్థిని బాత్‌రూం వెళ్లేందుకు బయటకు రాగా కారుణ్య కళాశాల ఆవరణలో రక్తపుగాయాలతో పడి ఉంది. గమనించిన తోటి విద్యార్థినులు హాస్టల్ వార్డెన్‌కు తెలిపారు. వెంటనే 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి 8.30 గంటలకు మృతి చెందినట్లు ఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు. ఆసుపత్రి వద్ద మృతురాలి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఏఎస్పీ ఆసుపత్రి వద్దకు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.
కాగా కారుణ్య కళాశాల భవనంపైకి వెళ్లినట్లు సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డు కావడంతో ఎందుకు వెళ్లి ఉంటుందోనని పోలీసులు ఆరా తీరుస్తున్నారు. పైఅంతస్తు నుంచి తానే దూకిందా? లేక ఎవరైనా తోసివేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. హాస్టల్‌లోకి ఆఘంతకుడు ప్రవేశించడం చూశామని కళాశాల విద్యార్థినులు తెలపడం గమనార్హం. కళాశాల యాజమాన్యం అసలు విషయాన్ని కప్పిపుచ్చుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ జరపాలని దళిత సంఘాలు పట్టుపడుతున్నాయి.