రూ.200కోట్ల భారీ స్కామ్.. రైస్ మిల్లర్స్ జిల్లా అధ్యక్షుడి అరెస్ట్
సీఎమ్మార్ ధాన్యం ప్రభుత్వానికి ఇవ్వకుండా కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణల నేపథ్యంలో సోమ నర్సయ్యతో పాటు ఆయన సోదరుడు సోమయ్యను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు.
సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మిడి సోమ నర్సయ్య అరెస్టయ్యారు. సీఎమ్మార్ ధాన్యం ప్రభుత్వానికి ఇవ్వకుండా కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణల నేపథ్యంలో సోమ నర్సయ్యతో పాటు ఆయన సోదరుడు సోమయ్యను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. కాగా, ఇవాళ(సోమవారం) జడ్జి ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
ఉన్నతాధికారుల ఆదేశాలతో చేపట్టిన తనిఖీలో ఈ భారీ స్కామ్‌ను గుర్తించారు. మూడు మిల్లుల్లో రూ.200కోట్ల విలువ చేసే ధాన్యం మయమైనట్లు అధికారులు తేల్చారు. ఏప్రిల్ 16న తిరుమలగిరి, నాగారం మండలాల్లోని ఇమ్మడి సోదరులకు చెందిన రెండు రైస్ మిల్లులపై అదనపు కలెక్టర్, ఆర్డీవో, సివిల్ సప్లైస్ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.
ఈతనిఖీల్లో 2020-21 సంవత్సరానికి సంబంధించి తిరుమలగిరిలోని సంతోష్ రైస్ మిల్లు నుంచి రూ.91.31 కోట్ల విలువైన 41,365 టన్నుల ధాన్యం, నాగారం మండలంలోని ప్రగతి నగర్ మిల్లు నుంచి రూ.7.71కోట్ల విలువైన 3,500టన్నుల ధాన్యం బకాయి ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు.