హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం
విశ్వంభర, మహబూబాబాద్ : అప్పుల బాధతో రోజుకు అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పు ఇచ్చిన వాళ్ల వేధింపులు, సూటిపోటీ మాటలు తాళలేక తనవు చలిస్తున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని పోషించలేక.. ఇటు చేసిన అప్పులు తీర్చలేక.. భార్యపిల్లలను అనాథలను చేసి ప్రాణాలను తీసుకుంటున్నారు. ఇందులో పేద, మధ్య తరగతి కుటుంబాలే కాదు.. ప్రభుత్వ ఉద్యోగస్తులు సమిధులవుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలచివేసింది.
బత్తిని మనోహర్ (50) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కంట్రోల్ రూంలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఇటీవల ఆయనకు అప్పులు పెరిగిపోయాయి. వచ్చే జీతంతో అప్పులు తీర్చలేక.. అప్పుల వాళ్ల బాధ భరించలేక శుక్రవారం తెల్లవారు జామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న నరసింహా నగర్‌లో మనోహర్ చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందికి దింపారు. అనంతరం పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అప్పులు బాధతో గతకొంత కాలంగా మనోవేదన చెందుతున్నాడని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతేకాదు.. తోటి ఉద్యోగులు కూడా కొన్ని రోజుల నుంచి మనోహర్ డల్ గా ఉంటుంన్నాడని తెలిపారు. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని మనోహర్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇటీవల అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఆత్మహత్యలు భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.