సుచిత్రలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో మాజీ మంత్రి మల్లారెడ్డి..!

సుచిత్రలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో మాజీ మంత్రి మల్లారెడ్డి..!

మాజీ మంత్రి మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య భూ వివాదం నెలకొంది. ఈ క్రమంలో తమ భూమిని కబ్జా చేశారంటూ మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో మాజీమంత్రితో పాటు ఆయన అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సుచిత్ర పరిధిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య భూ వివాదం నెలకొంది. ఈ క్రమంలో తమ భూమిని కబ్జా చేశారంటూ మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో మాజీమంత్రితో పాటు ఆయన అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. సుచిత్రలోని సర్వే నెంబర్ 82లో ఉన్న తన భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్ వేశారని, దాన్ని తొలగించాలని మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అంతేకాదు.. పెన్సింగ్‌ను తొలగించాలని తన అనుచరులను పురమాయించారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఘర్షణకు దిగొద్దని మల్లారెడ్డికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినిపించుకోని మల్లారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కేసు పెడితే పెట్టుకోండి.. నా భూమిని కాపాడుకుంటా అంటూ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ముందే మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్‌ను కూల్చివేశారు. అయితే ఈ భూమికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తున్నట్లు సమాచారం. 

Read More జేఎన్టీయూ విద్యార్థి శైలజకు డాక్టరేట్.

ఈ క్రమంలో కొందరు ఆ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఈ భూమి తమదేనంటూ ఓ 15మంది వచ్చారని తెలిపారు. తాము 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామని స్పష్టం చేశారు. అయితే, పోలీసులు వన్‌సైడ్‌గా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే ఆరోపించారు.  ఈ క్రమంలో పోలీసులు ఎంత సర్దిచెప్పే ప్రయత్నం చేసినా మల్లారెడ్డి, ఆయన అల్లుడు వినిపించుకోలేదు దీంతో వారిని పేట్ బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.