All India Pregnant Job: ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్.. ఇదో కొత్తరకం మోసం..!!
All India Pregnant Job: ఇంటర్నెట్‌లో కనిపించిన ఒక ఆన్‌లైన్ ప్రకటన బిహార్‌లో కలకలం రేపింది. పిల్లలు కలగని మహిళలను తల్లుల్ని చేస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రచారం చేస్తూ, “ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్” అనే పేరుతో మోసగాళ్లు వల విసిరారు.
All India Pregnant Job: ఇంటర్నెట్‌లో కనిపించిన ఒక ఆన్‌లైన్ ప్రకటన బిహార్‌లో కలకలం రేపింది. పిల్లలు కలగని మహిళలను తల్లుల్ని చేస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రచారం చేస్తూ, “ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్” అనే పేరుతో మోసగాళ్లు వల విసిరారు. ఈ ప్రకటనను నమ్మిన చాలా మంది చివరికి మోసపోయారు. ఫోన్ కాల్స్ ద్వారా మాయమాటలు చెప్పి భారీగా డబ్బు దండుకున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒకరు మైనర్ కావడం మరింత సంచలనంగా మారింది.
ఈ మోసం ఎలా జరిగిందంటే..
పిల్లలు కలగక బాధపడుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని, ఆకర్షణీయమైన మోడళ్ల ఫోటోలతో సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లలో ప్రకటనలు పెట్టారు. తాము దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నామని, ఏ రాష్ట్రానికి చెందిన వారైనా తమ ‘జాబ్’లో పాల్గొనవచ్చని చెప్పారు. ప్రకటనలో ఇచ్చిన ఫోన్ నంబర్‌కు కాల్ చేస్తే, మహిళను ప్రెగ్నెంట్ చేయగలిగితే రూ.10 లక్షలు ఇస్తామని, ఒకవేళ ప్రయత్నం విఫలమైతే కనీసం సగం మొత్తం చెల్లిస్తామని నమ్మబలికేవారు.
ముందుగా రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బు వసూలు చేశారు. “పని పూర్తయితే పెద్ద మొత్తం వస్తుంది” అనే ఆశతో కొందరు, “డబ్బుతో పాటు సుఖం కూడా” అనే మాయలో మరికొందరు ఈ వలలో చిక్కుకున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన వెంటనే హోటల్ టారిఫ్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ అంటూ ఒక్కొక్క పేరుతో మళ్లీ మళ్లీ డబ్బు అడిగేవారు. ఒక ఫీజు కట్టగానే మరో కారణం చెప్పి చెల్లింపులు చేయించుకునేవారు.
చాలా మంది డబ్బులు ఇచ్చిన తర్వాతే మోసమని గ్రహించారు. అయితే పరువు పోతుందన్న భయంతో కొందరు మౌనం పాటించారు. మరికొందరు మాత్రం ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులిద్దరినీ పట్టుకున్నారు. వారిలో ఒకరు మైనర్ అని తేలడంతో కేసు మరింత సీరియస్‌గా మారింది. ఈ ఘటన ఆన్‌లైన్ ప్రకటనలపై ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి గుర్తు చేస్తోంది. అధిక డబ్బు ఆశ చూపించే, నైతికంగా అనుమానాస్పదమైన ఆఫర్లు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.



