రేవ్ పార్టీ కేసు.. విచారణకు డుమ్మా కొట్టిన నటి హేమ
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నిందితులను సీసీబీ అధికారులు ఇవాళ(సోమవారం) నుంచి విచారించనున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న నటి హేమ విచారణకు డుమ్మా కొట్టింది.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నిందితులను సీసీబీ అధికారులు ఇవాళ(సోమవారం) నుంచి విచారించనున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న నటి హేమ విచారణకు డుమ్మా కొట్టింది. తాను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నానని తెలిపింది. విచారణకు హాజరయ్యేందుకు తనకు కొంత సమయం కావాలని సీసీబీకి లేఖ రాసినట్లు సమాచారం.
అయితే ఆ లేఖను పరిగణలోకి తీసుకోవడం లేదని సీసీబీ అధికారులు వెల్లడించారు. దీంతో హేమకు మరో నోటీసు ఇవ్వడానికి పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తీగలాగితే డొంకంతా కదిలినట్లు ఈ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
రేవ్ పార్టీలో 103 మంది పాల్గొనగా వారిలో 86మంది మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు తేలిందని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. మరోవైపు ఈ కేసులో అరెస్టైన ఆరుగురు నిందితుల్లో ఐదుగురి బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఈ కేసులో పొలిటికల్ లీడర్లు, ప్రముఖులతో లింకులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. రేవ్ పార్టీ జరిగిన చోట ఏపీ మంత్రి కాకాని పేరుతో స్టిక్కర్ ఉన్న కారును పోలీసులు గుర్తించారు. దీంతో ఆ మంత్రి అనుచరుడు పూర్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.