విజయవాడ హైవేపై లారీ బీభత్సం

6 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

విజయవాడ హైవేపై లారీ బీభత్సం

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల పరిధిలోని బాటసింగారం వద్ద ఓ లారీ అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో:  హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల పరిధిలోని బాటసింగారం వద్ద ఓ లారీ అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ ఒక్కసారిగా నిలిచిపోయింది. ఈ ఘటనతో విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నుంచి ఇనామ్‌గూడ వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు భారీ సంఖ్యలో సొంతూళ్లకు వెళ్తుండటంతో, ఈ ప్రమాదం ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపింది. గంటల తరబడి వాహనాలు కదలకపోవడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు.

రంగంలోకి పోలీసులు
సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ల సహాయంతో బోల్తా పడిన లారీని పక్కకు తొలగించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని లేదా ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

Read More అఖండ-2 అఖండమైన విజయం సాధిస్తుంది