నేడు చంద్రబాబు పోలవరం సందర్శన
- సీఎంగా తొలి క్షేత్రస్థాయి పర్యటన
- ఉదయం 11.45గంటలకు పోలవరం చేరుకోనున్న బాబు
- అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు(సోమవారం) పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతచంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన ఇదే మొదటిది. ఉదయం 11.45 గంటలకు పోలవరానికి చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 వరకు పోలవరం ప్రాజెక్టులో వివిధ భాగాలను సీఎం సందర్శిస్తారు. మధ్యాహ్నం 2.05 గంటల నుంచి 3.05 గంటల వరకు అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలతో సమీక్ష నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 3.10 గంటలకు మీడియాతో మాట్లాడతారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం నుంచి ఉండవల్లికి చంద్రబాబు బయలుదేరతారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులను మంత్రి రామానాయుడు ఆరా తీశారు. వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని ఆరోపణలు చేస్తూ వచ్చింది. అయితే, డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 600 కోట్లు అవసరం అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఖర్చు ఎవరు భరిస్తారనే సందిగ్ధంలో పనులు ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన కేంద్రం నిధులు ఇవ్వడంలో మాత్రం చొరవ చూపడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి నిధులు తెప్పించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.