సామాన్యుడి నుంచి అతిపెద్ద సామ్రాజ్య అధినేతగా.. రామోజీ ప్రస్థానం ఇదే..!

సామాన్యుడి నుంచి అతిపెద్ద సామ్రాజ్య అధినేతగా.. రామోజీ ప్రస్థానం ఇదే..!

మలుపు తిప్పిన చిట్ ఫండ్ కంపెనీ
ఈనాడు పత్రికతో తిరుగులేని ఖ్యాతి
ఫిల్మ్ సిటీ, బ్యానర్ ప్రారంభంతో సినీ ఎంట్రీ
ప్రియా పచ్చళ్ల వ్యాపారం సక్సెస్

రామోజీరావు.. తెలుగు నేలపై ఆయన ఓ బ్రాండ్. తెలుగు ప్రజలకు మీడియా అంటే ఏంటో చూపించిన వ్యక్తి. ఆయన రాసే రాతలకు ప్రభుత్వాలే తారుమారు అవుతాయి. అంత పవర్ ఫుల్ వ్యక్తిగా ఆయనకు పేరుంది. అతిపెద్ద సామ్రాజ్య అధినేతగా ఎదిగిన ఆయన.. కొద్ది సేపటి క్రితమే కన్నుమూవారు. ఈ సందర్భంగా ఆయన సామాన్యుడి నుంచి అతిపెద్ద సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించారో తెలుసుకుందాం.

చెరుకూరి రాజమోజీ రావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న జన్మించారు. చదువు పూర్తయిన తర్వాత ఆయన ఓ చిన్న ఏజెన్సీలో ఆర్టిస్టుగా జీవితం ప్రారంభించారు. అది నచ్చక ఆయన 1962లో హైదరాబాద్ వచ్చి మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థను ప్రారంభించారు. అంతే అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. అంచెలంచెలుగా ఆ సంస్థ పెద్దది అయింది. వందలాది బ్రాంచులు ఏర్పాటు చేశారు.

Read More అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం .. హైదరాబాదీ యువకుడు మృతి

అలా ఎదుగుతున్న క్రమంలోనే ఆయన 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు. అందులో వ్యవసాయానికి సంబంధించిన వార్తలు రాసేవారు. దాని తర్వాత ఆగస్టు 10 1974న విశాఖపట్నంలో రామోజీరావు ‘ఈనాడు’ పత్రికను స్థాపించారు. ఇది అనతికాలంలోనే తెలుగు ఉమ్మడి ఏపీ ప్రజలకు బాగా చేరువైంది. 

తక్కువ కాలంలోనే సంచలనాలు సృష్టించి అతిపెద్ద దినపత్రికగా ఎదిగింది. ఆ తర్వాత సినీ ప్రేమికుల కోసం ‘సితార’, బాషా ప్రేమికుల కోసం ‘చతుర’, ‘విపుల’ మాస పత్రికలను కూడా తీసుకొచ్చారు. దాని తర్వాత ‘ప్రియా ఫుడ్స్‌’ పేరుతో పచ్చళ్ల వ్యాపారం కూడా ప్రారంభించారు.

అటు మీడియాలో ఎదుగుతూనే.. ఇటు సినీ రంగంలోకి ప్రవేశించారు. 1983లో ‘ఉషాకిరణ్‌ మూవీస్‌’ సంస్థను స్థాపించి అనేక సినిమాలు ఇందులో తీశారు. కానీ అది ఆయనకు సరిపోలేదు. అందుకే ‘రామోజీ ఫిల్మ్‌ సిటీ’ని ఏర్పాటు చేశారు. ఇది ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద ఫిల్మ్ సిటీగా ఉంది. 

ఇక అక్కడి నుంచి ఆయన సామ్రాజ్యం వందల కోట్ల నుంచి వేలకోట్లకు చేరుకుంది. తర్వాత అప్పట్లోనే ఈటీవీ ఛానెల్ ను తీసుకొస్తే అది కూడా సక్సెస్ అయింది. 2002లో ‘రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌’ను స్థాపించారు. ఈటీవీ భారత్ పేరుతో మొబైల్ న్యూస్ యాప్ ను తెచ్చారు ఆయన. ఇలా మీడియా, సినీ రంగంలో అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సేవలకు గాను 2016లో పద్మవిభూషణ్ అవార్డు వరించింది. ఇన్ని చేసిన ఆయన.. 87 ఏళ్ల వయసులో శనివారం ఉదయం తెల్లవారుజామున కన్నుమూశారు.