వైఎస్సార్ విగ్రహాలపై అల్లరిమూకల వికృతదాడులు దారుణం: షర్మిల

వైఎస్సార్ విగ్రహాలపై అల్లరిమూకల వికృతదాడులు దారుణం: షర్మిల

కొందరు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ కండువాలు కప్పడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ తనయ, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఏపీలో ఎన్నికల పోలింగ్ సమయంలో వైఎస్సార్ శ్రేణులు టీడీపీ నేతలపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో భారీ విజయాన్ని కైవసం చేసుకున్న కూటమి విజయానందంతో పాటు టీడీపీ నేతలపై దాడికి ప్రతిదాడులు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ తరుణంలో శనివారం కొందరు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ కండువాలు కప్పడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ తనయ, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్సార్ విగ్రహాలపై అల్లరిమూకలు చేస్తున్న వికృతదాడులను ఖండించారు. మహానేత విగ్రహంపై ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణమని పేర్కొన్నారు.

‘‘రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం. ఎలాంటి  పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే. ఇది పిరికిపందల చర్య తప్ప మరొకటి కాదు. తెలుగువారి గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం. అలాంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదు. గెలుపు ఓటములు ఆపాదించడం తగదు. వైఎస్సార్‌ను అవమానించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు బాధ్యులైన వారిపై వెనువెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.’’ అంటూ షర్మిల ట్వీట్‌ చేశారు.

Related Posts