ఘనంగా హజరత్ అబ్బాస్ దర్గా షరీఫ్ ఉత్సవాలు
- మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్ దర్గా
- గుట్టపై మక్కా మహేశ్వర స్వామి కళ్యాణం
- హిందూ, ముస్లింలు కలిసి జరుపుకునే జాతర
విశ్వంభర, చింతపల్లి : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండో జాన్ పాడ్ గా పేరుగాంచిన అజహరత్ అబ్బాస్ దర్గా ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. చింతపల్లి మండలం పీకే మల్లేపల్లిలో కొలువైన ఈ దర్గా 57వ ఉర్సు శనివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు మహబూబ్ నగ ర్, రంగారెడ్డి, హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, ప్రకాశం, ఖమ్మం, వరంగల్, మెదక్ తదితర జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారు . దర్గాను దర్శిస్తే శరీరంలోని రుగ్మతులు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. ఓ వైపు ఉర్సు మరో వైపు మక్కా మహేశ్వరుడి కళ్యాణం , హజరత్ అబ్బాస్ దర్గా కింది భాగంలో ఉండగా గుట్ట పై భాగంలో ఓం శ్రీ గిరి మక్కా మహేశ్వరస్వామి ఆలయం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఓ వైపు మహేశ్వరస్వామి ఉత్సవాలు, మరో వైపు దర్గాలో ఉర్సు జరగడం ఇక్కడి ప్రత్యేకత. హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీక ఈ దర్గా. గుట్టపై శ్రీ వినాయక స్వామి, మహేశ్వరస్వామి, ఉమామహేశ్వర దేవి, ఆంజనేయస్వామి ఆలయాలతో పాటు నవ గ్రహాలనూ ప్రతిష్టించారు. ఈ ఉత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాలతో అలంకరించిన 75 అడుగుల ఎత్తు గల మక్కా మదీన శివలింగం నమూనాల అలంరణలు భక్తులను అమితంగా ఆకర్షిస్తాయి. చింతపల్లి మండలం మాల్, కుర్మేడు, కురంపల్లి, సాయిరెడ్డి గూడెం, ఎం మల్లేపల్లి మీదుగా బస్సు సౌకర్యం ఉంది. ఉర్సు సందర్భంగా అన్ని రూట్లలో బస్సులను ఏర్పాటు చేశారు. 3 రోజులు మహా అన్నదానం కార్యక్రమం ఉంటుంది.
మంత్రులు, ఐఏఎస్ అధికారులు వచ్చే అవకాశం ఉంది
హజరత్ అబ్బాస్ దర్గా ఉత్సవాల్లో ఈ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఐఏఎస్ లు తప్పనిసరిగా హాజరుకావడం ఆనవాయితీ. ఉత్సవాలకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీరా రెడ్డి, ఎమ్మెల్యే బాలునాయక్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పలువురు అధికారులు ఈ ఉత్సవాలకు హాజరుకానున్నారు.
ఉర్సు షెడ్యూల్
21 రాత్రి 11 గంటల నుంచి మహమ్మద్ చాంద్ పాషా చే ఒంటెపై గంధం ఊరేగింపు, ఉదయం 8 గంటలకు ఓం శ్రీ గిరి మక్కా మహేశ్వరస్వామి కళ్యాణోత్సవం, 23న భక్తుల దీపారాధన, కందూళ్లు నిర్వహిస్తారు.



