అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా వైద్య విద్యార్థిని..
అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా వైద్య విద్యార్థిని నియమిస్తున్నట్టు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి శనివారం చంద్రబాబు నాయుడిని కలిసింది. తమకు ఉన్న మూడు ఎకరాల పొలంలో ఎకరం అమ్మగా వచ్చిన రూ.25 లక్షలను, తన గాజులు అమ్మగా వచ్చిన రూ.లక్షను అమరావతికి, పోలవరం ప్రాజెక్టుకు విరాళంగా ఇచ్చింది.
దాంతో చంద్రబాబు నాయుడు ఆమెను ప్రశంసించారు. ఒక డాక్టర్ చదివే అమ్మాయి ఇలా రాష్ట్రం కోసం ఆలోచించడం చాలా అభినందించదగ్గ విషయం అన్నారు. నేటి యువతకు వైష్ణవి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. ఇలాంటి యువకులు కలలు గంటున్న రాజధాని కలను నిజం చేసి చూపిస్తామన్నారు.
ఇక రాజధాని, పోలవరం కోసం ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చిన వైష్ణవిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు తెలిపారు. వైష్ణవిని సీఎం శాలువా కప్పి సత్కరించారు. ప్రస్తుతం వైష్ణవి విజయవాడలోని ఓ మెడికల్ కాలేజ్ లో ప్రస్తుతం ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమె తండ్రి అంబుల మనోజ్‌ను సీఎం అభినందించారు.