మహిళలకు సమాన హక్కులను కల్పించాలి
ఏఐసీటీయూ జిల్లా అధ్యక్షురాలు ఇరుపు ప్రియాంక
విశ్వంభర, మహబూబాబాద్: అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు సమాన హక్కులను ప్రభుత్వాలు కల్పించాలని ఏఐసీటీయూ జిల్లా అధ్యక్షురాలు ఇరుపు ప్రియాంక అన్నారు. కేసముద్రంలో శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో మహిళల సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరుపు ప్రియాంక మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల్లో మహిళలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించారు. మహిళా హక్కులు, సంక్షేమ పథకాల కోసం రూపొందించిన చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి లాంటి మహిళామణుల పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మరిపెళ్లి నర్సమ్మ, జాటోత్ లక్ష్మి, బానోత్ సుక్నిని, గుండు సారమ్మ, వేముల సరోజన, కంకనాల నాగమ్మ, సపారపు రజిత, ఉప్పలమ్మతో పాటు ఎఐసిటియు జిల్లా కార్యదర్శి మరిపెల్లి మొగిలి, జాటోత్ బిచ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.



