వేడిమిని తగ్గించడానికి చెట్లు నాటడమే పరిష్కారం
సూచించిన ఐఐటీ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం
విశ్వంభర, సంగారెడ్డి: ప్రపంచ ఉష్ణోగ్రత 2050 నాటికి 1.5 డిగ్రీల సెల్సియస్, 2100 నాటికి 2-4 డిగ్రీల సెల్సియస్ లు పెరుగుతాయనే అంచనా ఉందని, ఈ అసాధారణ వేడిమిని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ తమకు వీలయినంతగా చెట్లు నాటడం ఒక్కటే పరిష్కారమని ఐఐటీ హైదరాబాద్ లోని రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం చల్లపల్లి సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం ‘శక్తి, ఆరోగ్య సంరక్షణలో కొత్త సరిహద్దులు’ అనే అంశంపై నిర్వహించిన ఒకరోజు సింపోజియంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. స్కాలర్ సైంటిఫిక్ సహ-సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం శక్తి, ఔషధ రంగాలలోని ప్రముఖులను ఆహ్వానించి, ఈ కీలక రంగాలలో తాజా పురోగతులు, సవాళ్లపై లోతైన అవగాహనతో కూడిన చర్చలకు వేదికగా నిలిచింది. స్థిరమైన ఇంధన వనరుల అత్యవసర అవసరాన్ని ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నొక్కి చెబుతూ, గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యాన్ని, పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతల ముఖ్యమైన సమస్యను ప్రముఖంగా ప్రస్తావించారు. సాంప్రదాయ ఇంధనాలతో హైడ్రోజన్ ను అనుసంధానించడం యొక్క సాధ్యాసాధ్యాల గురించి ప్రొఫెసర్ చల్లపల్లి క్లిష్టమైన ప్రశ్నలను లేవనెత్తారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడతాన్ని తగ్గించడానికి సహజ వాయువు, ఇథనాల్ తో హైడ్రోజన్ ను కలపడం యొక్క తక్షణ అన్వేషణకు ఆయన మద్దతు ఇచ్చారు.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఏపీఐ-పరిశోధన-అభివృద్ధి రసాయన శాస్త్ర అధిపతి, ఉపాధ్యక్షుడు డాక్టర్ రాకేశ్వర్ బండిచర్ ఈ సందర్భంగా ‘ఫార్మా ఆవిష్కరణల’పై కీలకోపన్యాసం చేస్తూ, ఔషధ రంగంలో ఆవిష్కరణల పరివర్తన పాత్రను వివరించారు. ప్రపంచంలోని ప్రతి ఐదవ జనరిక్ ఔషధం భారతదేశంలో తయారైందేనని, అభివృద్ధి చెందుతున్న దేశాలలో అవసరమైన ఔషధాల లభ్యతకు మనదేశం గణనీయంగా దోహపడుతోందని డాక్టర్ రాకేశ్వర్ తెలిపారు. కృత్రిమ మేధస్సు (ఏఐ), ఔషధ ఆవిష్కరణ గురించి డాక్టర్ రాకేశ్వర్ మాట్లాడుతూ, ప్రాణాలను రక్షించే ఔషధాల అభివృద్ధిని వేగవంతం చేయడంలో జనరేటివ్ ఏఐ విప్లవాత్మక ప్రభావాన్ని ఆయన గుర్తించారు. ఏఐ-కనుగొన్న అణువుల కోసం ఒకటో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడం వంటి ఇటీవలి విజయాలను డాక్టర్ రాకేశ్వర్ ఉదహరించారు. తొలుత, సైన్స్ డీన్ ప్రొఫెసర్ కొల్లూరు శ్రీకృష్ణ అతిథులను స్వాగతించగా, పర్యావరణ శాస్ర అధ్యాపకురాలు డాక్టర్ ఉమాదేవి ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.



