సమాజంలోని రుగ్మతలను రూపుమాపేది నాటక రంగం - కేంద్ర ఖాదీ చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం
On
విశ్వంభర, ఉమ్మడి వరంగల్ జిల్లా : సమాజంలోని నెలకొన్న మూఢనమ్మకాలు, వరకట్నం, మహిళలు, బాల బాలికలపై హింస, తదితర సామాజిక రుగ్మతలను రూపుమాపేది నాటక రంగమేనని కేంద్ర ఖాదీ చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ మరియు చలనచిత్ర నాటక రంగ అభివృద్ధి సంస్థ హైదరాబాద్ సౌజన్యంతో వరంగల్ జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా నగరంలోని పోతన విజ్ఞాన పీఠం ఆడిటోరియంలో జరుగుతున్న 16వ జాతీయస్థాయి నాటక పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈగ మల్లేశం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాటక రంగాన్ని భావితరాలకు అందించేందుకు కళాకారులను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వం ప్రజలు కళాకారులను ఆదుకోవాలని అన్నారు. యువత సన్మార్గంలో నడిపించేది నాటక రంగమే అన్నారు. సమాజంలో జరుగుతున్న రుగ్మతలను ప్రజలకు కళ్ళకు కనిపించేటట్టు చూపించేది నాటక రంగమేనన్నారు. తాను గత 25 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కళాకారులను ప్రోత్సహిస్తూ కళామండలి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో కళాకారులను అన్ని విధాల ఆదుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం నాటక రంగ అధ్యక్షులు కాజీపేట తిరుమలయ్య వారి కార్యవర్గ సభ్యులు అందరూ ఈగ మల్లేశం నీ ఘనంగా సన్మానించడం జరిగింది.