బీఆర్ఎస్ నాయకుడి భవన నిర్మాణం కూల్చివేత - నాపై మునుగోడు ఎమ్మెల్యే రాజకీయ కక్ష

బీసీ నాయకుడిపై  రాజకీయంగా ఎదురుకోలేక దాడులు  - బీఆర్ఎస్ నాయకులపై అధికార పార్టీ ఆగడాలు - చండూర్ మాజీ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న 

బీఆర్ఎస్ నాయకుడి భవన నిర్మాణం కూల్చివేత - నాపై మునుగోడు ఎమ్మెల్యే రాజకీయ కక్ష

విశ్వంభర, చండూరు : చండూరు మున్సిపల్ కేంద్రంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్నకు చెందిన నిర్మాణంలో ఉన్న భవనాన్ని మున్సిపల్ అధికారులు మంగళవారం ఉదయం కూల్చివేయటం స్థానికంగా సంచలనం సృష్టించింది. మున్సిపల్ కమిషనర్ ఎస్.మల్లేశం మాట్లాడుతూ భవనానికి అనుమతులు లేకపోవటం వల్లనే కూల్చివేశామని అన్నారు. భవన యజమాని హై కోర్టుకు, ఆర్డీఎంలో వేసిన పిటిషన్ కోర్టులు కొట్టి వేసాయని అందుకే కూల్చివేశామని అన్నారు. మున్సిపాలిటీలో మరో నిర్మాణానికి కూడా అనుమతులు లేవని కూల్చివేతకు అనుమతి రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే మున్సిపాలిటీలో అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ కేంద్రంలోని తనకు చెందిన భవనాన్ని అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తాను లేని సమయంలో అక్రమంగా కూల్చి వేశారని మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తోకల వెంకన్న ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియతో మాట్లాడుతూ నేను బీసీ నాయకుడి కాబట్టే తన ఎదుగుదలను ఓర్వలేక ఎమ్మెల్యే కక్ష గట్టి తన భవనాన్ని కూల్చి వేశారన్నారు. తన పక్కనే ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గృహ నిర్మాణానికి అనుమతులు తెచ్చుకొని అక్రమంగా వ్యాపార సముదాయం నిర్మిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ఇక్కడ రోడ్డును ఒక్కో వైపు 40 ఫీట్లకు అధికారులు నిర్ణయించగా తాను 43 ఫీట్ల దూరంలో భవనాన్ని నిర్మించానని, అయినప్పటికీ అధికారులు కూల్చి వేయటం నిబంధనలకు విరుద్ధం అన్నారు. చండూరులో నిర్మిస్తున్న రోడ్డు పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని అంతటా ఒకే లాగా నిర్మించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులకు కమీషన్లు ఇస్తే తక్కువ వెడల్పులో రోడ్డు నిర్మిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలు గమనిస్తున్నారని న్యాయం కోసం కోర్టును సంప్రదించనున్నట్లు తెలిపారు.

Tags: