విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి. -సీఐ ఆదిరెడ్డి. -మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సు.
చదువే లక్ష్యంగా ముందుకు సాగాలి
On
విశ్వంభర, చండూరు: మాదకద్రవ్యాలు, డ్రగ్స్ కు విద్యార్థులు దూరంగా ఉండాలని, చదువే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలని చండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. ఆదిరెడ్డి, ఎస్ఐ ఎన్. వెంకన్న గౌడ్ లు అన్నారు. సోమవారం నాడు చండూరు మున్సిపాలిటీలోని గాంధీజీ విద్యాసంస్థలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం మరియు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. నేటి సమాజంలో మాదకద్రవ్యాలు, డ్రగ్స్ కు అలవాటు పడిన యువత బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని అన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, వాటి దుష్ఫలితాలు బంగారు భవిష్యత్తును నాశనం చేస్తాయని అన్నారు. తల్లిదండ్రులు ఎంతో ఆశలతో పెంచి పెద్ద చేశారని, విధ్యే లక్ష్యంగా ముందుకు సాగి, ఉద్యోగ ఉపాధి అవకాశాలతో బంగారు బాటలు వేసుకోవాలని, కుటుంబ పోషణకు సహాయకులుగా ఎదగాలని ఆశిస్తుంటారని, అటువంటి కుటుంబాల్లో నుండి వచ్చిన విద్యార్థులు తెలిసో, తెలియకో మాదకద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావద్దని కోరారు. ప్రస్తుత సమాజంలో గంజాయి, మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా యువత వినియోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు. ముందు జాగ్రత్తగా విద్యార్థులు వాటికి దూరంగా ఉండి, తల్లిదండ్రులకు, పుట్టిన ఊరుకు, పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. మాదకద్రవ్యాలకు, డ్రగ్స్ కు వ్యతిరేకంగా సీఐ ఆదిరెడ్డి విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు, అనంత చంద్రశేఖర్, గంట సత్యం, గజ్జల కృష్ణారెడ్డి, ఎస్ఐ లింగారెడ్డి, కానిస్టేబుల్లు రాంబాబు, కౌశిక్, శ్రీకాంత్, గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ఇన్చార్జి ప్రిన్సిపల్ కందుల కృష్ణయ్య, పులిపాటి రాధిక, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.







