కలెక్టర్ కార్యాలయంలో రెడ్ క్రాస్ డొనేషన్ బాక్స్. - రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు కలెక్టర్ దాసరి హరిచందన సూచన..

ఆ ఫండ్స్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేయూత బోనాల ఉత్సవాల్లో వాలంటరీ వ్యవస్థను ఏర్పాటుచేయాలి.. 

కలెక్టర్ కార్యాలయంలో రెడ్ క్రాస్ డొనేషన్ బాక్స్. - రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు కలెక్టర్ దాసరి హరిచందన సూచన..

విశ్వంభర, హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేయూతనందించేలా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరుపున కలెక్టర్ కార్యాలయంలో 'డొనేషన్ బాక్స్'ను ఏర్పాటుచేయాల్సిందిగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన దాసరి హరిచందన సొసైటీ సభ్యులకు సూచించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా చైర్మన్ భీంరెడ్డి, యూత్ కన్వీనర్ మణిదీప్లు బుధవారం కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రెడ్ క్రాస్ సొసైటీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేయూతనందించే కార్యక్రమాలను చేపట్టాలని ఆమె సూచించారు. అవసరమైతే కలెక్టర్ కార్యాలయంలో డొనేషన్ బాక్స్ ఏర్పాటుచేసి దాని ద్వారా వచ్చే నిధులతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించాలన్నారు. అలాగే బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతున్న దృష్ట్యా ప్రధాన జాతరల నిర్వహణలో రెడ్ క్రాస్ సొసైటీ తరుపున వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటుచేయాల్సిందిగా చెప్పారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు సహాయం అందించేవిధంగా ఆ వాలంటీర్ వ్యవస్థ పనిచేసేలా చూడాలన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ మరింత ఉత్సాహంగా పనిచేసి సామాజిక సేవలో ముందుండాలని కలెక్టర్ వారికి సూచించారు. కలెక్టర్ను కలిసివచ్చిన అనంతరం భీంరెడ్డి, మణిదీప్ లు మాట్లాడుతూ కలెక్టర్ సూచనల మేరకు బోనాల ఉత్సవాల్లో వాలంటరీ వ్యవస్థను ఏర్పాటుచేసి తమ సేవలను విస్తృతం చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా డొనేషన్ బాక్స్ను ఏర్పాటుచేసి వాటి ద్వారా వచ్చే ఫండ్స్ ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి, విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని అందించనున్నామని వివరించారు. అనుకోని విపత్తులు ఎదురైతే ప్రజలకు అండగా నిలబడేలా వివిధ రకాల కార్యక్రమాలు అమలుచేసేందుకు రెడ్ క్రాస్ సొసైటీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.

Tags: