నీతివంతమైన రాజకీయాలే వ్యవస్థను బతికిస్తాయి: ఎంపీ ఆర్. కృష్ణయ్య

నీతివంతమైన రాజకీయాలే వ్యవస్థను బతికిస్తాయి: ఎంపీ ఆర్. కృష్ణయ్య

విశ్వంభర, హైదరాబాద్ : నేటి రాజకీయాలపై ప్రజలు అసహ్యం పెంచుకుంటున్నారని, కోట్లు ఖర్చు పెట్టి పదవులు సంపాదిస్తున్న కొందరు నాయకులు ప్రజా పనుల కోసం వచ్చిన వారిని 'రాబందుల్లా' పీక్కుతింటూ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ (టీఆర్ఎల్‌డీ) తెలంగాణ ప్రభుత్వ తీరును నిరసిస్తూ 3 ప్రధాన సమస్యలపై నిర్వహించిన దీక్షా కార్యక్రమానికి హాజరై ఆయన సంఘీభావం ప్రకటించారు.
 
రాజకీయ అవినీతిపై మండిపాటు
సేవకు మాత్రమే పరిమితమైన రాజకీయం నేడు వ్యాపారులు, సంపన్నుల ప్రవేశంతో పూర్తిగా వ్యాపారంగా మారిందని కృష్ణయ్య దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో కొందరు నాయకులు వందల కోట్లు సంపాదించుకున్నారని, తాము కూడా ఏమీ తక్కువ కాదన్నట్లు నేటి నాయకులు పోటీ పడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి దీనిపై దృష్టి సారించి పటిష్ట చర్యలు తీసుకుంటే చరిత్రలో నిలిచిపోతారని, లేదంటే అవినీతిని ప్రోత్సహించిన వారవుతారని కృష్ణయ్య పేర్కొన్నారు. నేడు అవినీతి బహిరంగమైందని, ఉత్తర భారత దేశంలో పది లక్షలు ఖర్చయ్యే రాజకీయ పోటీకి ఇక్కడ కోట్లు ఖర్చు పెడుతున్నారంటే రాజకీయ దిగజారుడుతనం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
టీఆర్ఎల్‌డీ డిమాండ్లు, వివిధ వక్తల అభిప్రాయాలు
అవినీతిపై యుద్ధం ప్రకటించేలా టీఆర్ఎల్‌డీ అధ్యక్షులు దిలీప్ కుమార్ సామాజిక బాధ్యతను భుజాన వేసుకోవడం అభినందనీయమన్నారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, 2009లో చట్టమైన విద్య హక్కు చట్టాన్ని రాష్ట్రంలో ఇప్పటికీ అమలు చేయకపోవడం బాధాకరమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 
మాజీ మంత్రి విజయరామారావు మాట్లాడుతూ, రాజకీయ అవినీతి వ్యవహారాన్ని ఒక అంశంగా తీసుకుని దీక్ష చేయడం అభినందనీయమన్నారు. నీతివంతమైన పాలన అని చెప్పి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అవినీతిని ప్రోత్సహించకుండా ప్రజలందరూ అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతుకు నాణ్యమైన విత్తనాలు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని, కానీ రేవంత్ సర్కార్ రైతును కష్టాల సుడిగుండంలోకి నెట్టిందని విమర్శించారు.
 
పాత్రికేయులు తెలంగాణ విఠల్ మాట్లాడుతూ, దేశంలో ప్రతి ఏటా వ్యవసాయ భూమి రియల్ ఎస్టేట్ కబందహస్తాల్లో చిక్కుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తీరు ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు లేదని, గెలిపించిన కొడంగల్ రైతులనే బేడీలు వేయించారని, వీరు పాలకులు కాదని, ప్రభుత్వంలో ఉన్నవారంతా మాఫియా పోలిన వారే ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 
నేషనల్ పొలిటికల్ జస్టిస్ సంస్థ చైర్మన్ నారగోని మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో బలమైన పాత్ర పోషించిన దిలీప్ కుమార్ అవినీతిపై పోరాటం ఎంచుకోవడం సంతోషం అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేయని చట్టం లేదని, ఇవ్వని హామీ లేదని ఎద్దేవా చేస్తూ, రాజ్యాంగాన్ని చంకన పెట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ విద్యా హక్కు చట్టం ఆచరణకు ఎందుకు చొరవ తీసుకోలేదని ప్రశ్నించారు.
 
ఈ సందర్భంగా టీఆర్ఎల్‌డీ అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ, అవినీతి ఆరోపణలు ఉన్నా ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఈ అవినీతి అంశంపై గవర్నర్‌ను కలుస్తామని హెచ్చరించారు. నకిలీ విత్తనాల సమస్య, విద్య హక్కు చట్టం అమలుపై ఆయన ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు.
 
పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు 25 శాతం ఉచిత విద్య అందించాలన్న చట్టం ఉన్నా పాలకులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి రైతు ఆచరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎస్సీ హెచ్ రంగయ్య మాట్లాడుతూ, రానున్న రోజుల్లో సేంద్రియ ఆహార ఉత్పత్తులకే డిమాండ్ ఉంటుందని, ఆ దిశగా రైతును సమాయత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, 100 శాతం రాయితీ ప్రతి రైతుకు అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే మరో రైతు విపత్తుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
 
ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కిన్నెర సిద్దార్థ మాదిగ, ఏపీ కాపునాడు నాయకులు వేల్పూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.Sequence 03.00_31_56_17.Still001

Tags: