యువ రైతుల శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
On
విశ్వంభర, మునుగోడు : రైతు వేదికలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువ రైతులకు పంటల సాగు మెలకువల పై ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ రైతుల శిక్షణ కార్యక్రమానికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మన కష్టం మనం చేసుకుంటూ ఆత్మగౌరవంతో జీవించేది వ్యవసాయమని, ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ రైతులు ఎక్కువ రాబడిని పొందాలని ఆకాంక్షించారు. వ్యవసాయానికి ప్రధాన వనరు నీరెనని.. ఆ నీటిని తీసుకొచ్చే బాధ్యత నాది అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా యజ్ఞం చేస్తున్నామని, ఒకవైపు శివన్న గూడెం రిజర్వాయర్ కి నీటిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే... మరోవైపు చిన్న నీటి వనరుల ద్వారా భూగర్భ జలాలు పెంచే విధంగా మొదటి దశగా 148 చెరువులను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. ఉద్యానవన శాఖ రైతులు కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఎక్కువ దిగుబడిని సాధిస్తున్న యువ రైతులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సమావేశంలో ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ సాగు చేస్తూ ఎక్కువ దిగుబడిని, అధిక రాబడి ని పొందుతున్న యువ రైతుల విజయ గాధలను ఇతర రైతులకు పరిచయం చేస్తూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆధునిక పద్ధతుల ద్వారా ఉద్యానవన శాఖ సలహాలు సూచనలతో వ్యవసాయం చేస్తే అధిక రాబడి పొందవచ్చని ఈ సమావేశం ద్వారా రైతులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అనంతరెడ్డి, మునుగోడు నియోజకవర్గ ఉద్యానవన శాఖ అధికారి విద్యాసాగర్, నియోజకవర్గంలోని యువ రైతులు అందరూ పాల్గొన్నారు.



