ఎవరు ఎన్ని కేసులు పెట్టిన చివరికి న్యాయమే గెలుస్తుంది : కొణతం దిలీప్

ఎవరు ఎన్ని కేసులు పెట్టిన చివరికి న్యాయమే గెలుస్తుంది : కొణతం దిలీప్

విశ్వంభర, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే జిల్లాల మార్పు, టీఎస్ ను టీజీ గా మార్పులు చేర్పులు చేసి అవి వెంటనే అమలు లోకి వచ్చాయి అని పేర్కొంది. అయితే తాజాగా ఆర్టీసీ నకిలీ లోగోను తయారు చేశారనే ఆరోపణలతో ఇద్దరు వ్యక్తుల మీద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై క్లారిటీ ఇస్తూ…ఇస్టా వేదికగా ఒక పోస్ట్ వైరల్ అవుతుంది.


“రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో నిన్న తెలంగాణ ప్రభుత్వం నామీద ఒక తప్పుడు కేసు పెట్టిన విషయం మీకు ఈపాటికే తెలిసి ఉంటుంది. ఆ కేసు పూర్వాపరాలు మీకు తెలిసి ఉండాలని ఈ నాలుగు మాటలు రాస్తున్నాను. గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతకు ముందున్న కేసీఆర్ ప్రభుత్వం ఆనవాలు తుడిచేస్తామంటూ వివిధ సంస్థల పేర్లు మార్చే పనికిమాలిన పని ఒకటి పెట్టుకున్నది.

Read More  మదర్ ల్యాంపులో మానసిక వికలాంగులకు అన్నదానం 

దీన్లో భాగంగానే టీఎస్ఆర్టీసీ సంస్థ (TSRTC) పేరును టీజీఎస్ ఆర్టీసీగా (TGSRTC) మార్చింది.  రెండు రోజుల క్రితం రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక వాట్సాప్ గ్రూపులో ఆర్టీసీ కొత్త లోగో అంటూ ఒక ఇమేజ్ పంపారు. దాన్ని మే 22వ తారీకు నాడు అనేక మీడియా సంస్థలు ప్రచురించాయి. మీడియా గ్రూపుల్లో ఉన్న జర్నలిస్టు మిత్రుల నుండి కూడా ఈ విషయం రూఢి చేసుకున్నాను.

ఆ లోగోలో ఇదివరకు పాత ఆర్టీసీ లోగోలో ఉన్న చార్మినార్, కాకతీయ తోరణం లేకపోవడం గురించి విమర్శిస్తూ నేను సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాను. ఒకరోజు తరువాత ఆర్టీసీ ఉన్నతాధికారులు నన్ను సంప్రదించి తాము ఇంకా కొత్త లోగో ఖరారు చేయలేదు అని వివరణ ఇచ్చారు. అప్పుడు నేను నా సోషల్ మీడియా పోస్టులు తొలగించాను.

కానీ నిన్న సాయంత్రానికి రేవంత్ సర్కార్ నా మీద, మిత్రుడు హరీష్ రెడ్డి మీద ఒక తప్పుడు కేసు పెట్టింది. మేమే ఆర్టీసీ నకిలీ లోగోను తయారుచేశాం అని మా మీద నిస్సిగ్గుగా ఒక అరోపణచేసి, వివిధ సెక్షన్ల మీద మా మీద కేసులు పెట్టింది. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు అసలు ఈ లోగోను రిలీజ్ చేసింది వారే, ఇప్పుడు అది బ్యాక్ ఫైర్ అయ్యేసరికి మాలాంటి వాళ్ల మీద కేసులు పెడుతున్నారు.

గమ్మత్తేమిటంటే మొన్న ఈ లోగోను అనేక మీడియా సంస్థలు ప్రచురిస్తే, వారెవరి మీదా కేసులు లేవు. ఇలా ప్రచురించిన మీడియా సంస్థల్లో ముందు వరుసలో కాంగ్రెస్ అనుకూల మీడియా సంస్థలు ఎన్‌టీవీ, వీ6, బిగ్ టీవీ ఉన్నాయి. కానీ ఎన్‌టీవీ తమ సోషల్ మీడియాలో షేర్ చేసిన లోగోను నేను షేర్ చేస్తే నా మీద మాత్రం అక్రమ కేసులు పెట్టారు!

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సుమారు పదేళ్లు రాష్ట్ర డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా నిబద్ధతతో పనిచేశాను. ఫేక్ న్యూస్ వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను నెలకొల్పి వేలాది ఫేక్ న్యూస్‌కు అడ్డుకట్ట వేశాను.  అలాంటి నా మీదనే ఇంత అన్యాయంగా, ఒక తప్పుడు కేసు పెట్టారంటే “ప్రజా పాలన” ముసుగులో గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ పాలన ఎట్లా సాగుతున్నదో మీ ఊహకే వదిలేస్తున్నా.

ఇలాంటి కేసులు ఎన్నిపెట్టినా బెదిరేది లేదు. న్యాయస్థానాల మీద నాకు పూర్తి నమ్మకం ఉన్నది. దీనివెనుక ఉన్న అసలు దోషులెవరో వారి భరతం పట్టుడు ఖాయం.  నిన్న, నేడు, రేపు తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసమే పనిచేస్తాను అని మరోసారి గుర్తుచేస్తూ… “ అంటూ వివరణ ఇచ్చారు.