సర్కారా.. సర్కస్ కంపెనీనా?
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ నిప్పులు
తెలంగాణ సచివాలయంలో ప్రస్తుతం థియేటర్ల కంటే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తన ఎక్స్ ఖాతాలో తీవ్రంగా విమర్శించారు.
విశ్వంభర, బ్యూరో: తెలంగాణ సచివాలయంలో ప్రస్తుతం థియేటర్ల కంటే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తన ఎక్స్ ఖాతాలో తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్‌లో ఉందనే అనుమానం ప్రజలకు కలుగుతోందని మండిపడ్డారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తెలియకుండానే టికెట్ల ధరల పెంపు ఫైళ్లు కదులుతున్నాయా ప్రశ్నించారు. "నా ప్రమేయం లేదు.. నా దగ్గరకు ఫైల్ రాలేదు" అని మంత్రి అనడం హాస్యాస్పదమన్నారు. క్యాబినెట్ మంత్రికి తెలియకుండా జీవోలు రావడం ప్రజా పాలననా? లేక పాపిష్టి పాలననా? అని నిలదీశారు. ఓడిపోయిన ఒక వ్యక్తి రాజ్యాంగేతర శక్తిగా మారి, సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్నారని, ఒక్కో సినిమాకు కోట్ల రూపాయిల కమీషన్ల దందా సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలకు, ఇప్పుడు జరుగుతున్న పనులకు పొంతన లేదని దుయ్యబట్టారు. తాను సీట్లో ఉన్నంత కాలం రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు అని మైకు పట్టుకుని ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు రాత్రికి రాత్రే మూడు సినిమాలకు రేట్లు ఎలా పెంచారు?" అని నిలదీశారు. టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా.. ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయమన్నారు. ఐటీ మంత్రిని నేనే.. సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇపుడు ఉన్న శాఖతో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారని, టిక్కెట్ల రేటు పెంపు సీఎం నిర్ణయమేనని కోమటి రెడ్డి చెప్పకనే చెపుతున్నారన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని చెప్పినందుకు ఒక హీరోపై, పేరు మర్చిపోయినందుకు మరో హీరోపై కక్ష కడుతున్నారని, నచ్చిన వాళ్లకు మాత్రం రూ. 600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తూ రాచమర్యాదలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో సినీ పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడటం వల్లే తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి చేరిందని గుర్తు చేశారు. ఈ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్న ఈ 'టికెట్ రేట్ల కమిషన్ల దందా'పై గవర్నర్ దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ చీకటి ఒప్పందాల వివరాలను త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు.



