కొండపోచమ్మ నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీళ్లు. -కెసిఆర్ పై మండిపడ్డ కొదుమూరి దయాకర్ రావు
కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక ప్రశ్నలు ! - మల్లన్నసాగర్ ముంపు గ్రామాల నుంచి రైతుల సాగునీటి కష్టాలు
విశ్వంభర, హైదరాబాద్ :- కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నీటి వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద 14 గ్రామాలు ముంపునకు గురికావడం, నిర్వాసితుల పునరావాసం, రైతులకు సాగునీటి ప్రయోజనాలు అందుతున్న తీరుపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా రైతులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు అందుతున్నాయా అనే అంశంపై సమగ్ర సమీక్ష జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.మరోవైపు, కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీరు చేరుతోందనే ఆరోపణలు పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి కొదుమూరి దయాకర్ రావు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంపై , కెసిఆర్ పై మండిపడ్డారు . ఫామ్‌హౌస్ పరిసరాల్లో బావులు, బోర్ల ద్వారా నీటి వినియోగం జరుగుతోందనే వాదనలపై అధికారిక రికార్డుల ఆధారంగా వాస్తవాలను నిర్ధారించాల్సి ఉంది. అలాగే భూముల కొనుగోలు వ్యవహారాలపై వస్తున్న ఆరోపణలను కూడా సంబంధిత పత్రాల ద్వారా పరిశీలించాల్సిన అవసరం ఉంది.దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, గొర్రెల పంపిణీ వంటి పథకాల అమలుపైనా గత ప్రభుత్వ పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణానికి ఖర్చు చేసిన ప్రజాధనం ద్వారా రైతులకు, ప్రజలకు ఎంతమేర ప్రయోజనం చేకూరిందనే అంశంపై స్పష్టత అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముంపు బాధితులకు న్యాయం చేయడంతో పాటు సాగునీటి పంపిణీ, ప్రాజెక్టుల నిర్వహణ, ప్రభుత్వ నిధుల వినియోగంపై పారదర్శక వివరాలు వెల్లడించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.



