గ్రామ భద్రతకు పెద్దపీట.. రూ.2 లక్షలతో రేగడి దోస్వాడలో సీసీ కెమెరాల ఏర్పాటు
షాబాద్ సీఐ డీకే లక్ష్మీ రెడ్డి సహకారంతో నూతన కెమెరాల ఏర్పాటు
విశ్వంభర, షాబాద్:రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం రేగడి దోస్వాడ గ్రామంలో ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తూ గ్రామ అభివృద్ధిలో భాగంగా సుమారు రూ.2 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. షాబాద్ సీఐ డీకే లక్ష్మీ రెడ్డి సహకారంతో గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టినట్లు గ్రామ సర్పంచ్ పీసరి పావని రమణారెడ్డి తెలిపారు.దీపావళి పండుగ నాటికి గ్రామంలో మరిన్ని ప్రాంతాల్లో నూతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి గ్రామాన్ని పూర్తిస్థాయిలో నిఘా నీడలోకి తీసుకువస్తామని ఆమె వెల్లడించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, దొంగతనాల నివారణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి షాబాద్ మండలంలో రేగడి దోస్వాడకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేలా కృషి చేస్తానని సర్పంచ్ పీసరి పావని రమణారెడ్డి తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఎలికట్ట రాములు, మాజీ ఎంపీటీసీ పార్వతమ్మ రామచంద్రయ్య, పలువురు గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



