ఒకరికి ఒకే ఓటు.. అనర్హుల పేర్లకు చోటు లేదు!,-డా. వైభవ్ రెడ్డి
ఓటరు జాబితా ప్రక్షాళనను రాజకీయం చేయొద్దు: డా. వైభవ్ రెడ్డి
విశ్వంభర, చేవెళ్ల:ఓటరు జాబితా ప్రక్షాళనను రాజకీయ కోణంలో చూడకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకు చేపట్టే చర్యగా పరిగణించాలని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. వైభవ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలనే రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నకిలీ ఓట్లను, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో నమోదైన ఓట్లను గుర్తించి సరిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఓటరు జాబితా నుంచి ఓట్లు తొలగించారంటూ ఆరోపణలు చేస్తున్న రాజకీయ పార్టీలు నిర్దిష్ట ఆధారాలతో తమ అభ్యంతరాలను వెల్లడించాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు, అనర్హమైన నమోదులకు తావులేకుండా చూడటం ఎన్నికల వ్యవస్థ బాధ్యత అని పేర్కొన్నారు.ఓటరు జాబితాలో తమ పేరు తొలగిపోయినట్లు భావించే అర్హులైన పౌరులు సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి, అవసరమైన గుర్తింపు పత్రాలతో తిరిగి నమోదు చేసుకోవచ్చని తెలిపారు. తొలగించిన ఓట్లన్నింటినీ ఎలాంటి పరిశీలన లేకుండా తిరిగి చేర్చాలనే డిమాండ్ల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని విమర్శించారు.భారతదేశ పౌరులకే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఓటు హక్కు వర్తిస్తుందని, విదేశీయులు లేదా ఓటు హక్కుకు అర్హత లేని వారి పేర్లకు ఓటరు జాబితాలో చోటు ఉండకూడదని డా. వైభవ్ రెడ్డి స్పష్టం చేశారు. ఓటరు జాబితా ప్రక్షాళనలో అర్హులైన ఒక్క ఓటరు కూడా నష్టపోకుండా, అనర్హమైన నమోదులను సరిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఒక వ్యక్తికి ఒకే ఓటు.. అర్హుడైన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు.. ఇదే ప్రజాస్వామ్య స్ఫూర్తి అని డా. వైభవ్ రెడ్డి పేర్కొన్నారు.



