అనిల్ ఈరవత్రికి ఎమ్మెల్సీ ఇవ్వాలని పద్మశాలీ సంఘాల డిమాండ్.
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పద్మశాలి సంఘ నాయకుల ప్రెస్ మీట్
విశ్వంభర, హైదరాబాద్ :- తెలంగాణలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, చేనేత కార్మికుల సంక్షేమం, గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం కృషి చేస్తున్న మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని పద్మశాలి, బీసీ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరారు. గురువారం నాడు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పద్మశాలి సంఘం ఎల్బీనగర్ సర్కిల్ అధ్యక్షులు పున్న గణేష్ నేత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన చేనేత ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికల పునరుద్ధరణకు అనిల్ ఈరవత్రి కృషి చేశారని తెలిపారు. 2025 మార్చి 9న నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించి, నేతన్నల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రూ.49 కోట్ల చేనేత రుణమాఫీ, నిలిచిపోయిన రూ.290 కోట్ల చేనేత చేయూత బకాయిల విడుదల వంటి చర్యలు చేపట్టడంలో ఆయన కృషి ఉందని వెల్లడించారు. అలాగే, గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించే విధానం అమలులోకి రావడంలోనూ అనిల్ ఈరవత్రి కీలక పాత్ర పోషించారని సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. బీసీల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, చేనేత కార్మికులు, శ్రామిక వర్గాల హక్కుల కోసం పనిచేస్తున్న ఆయన సేవలను గుర్తించాలని కోరారు. సహకార రంగం, చేనేత కార్మికుల సంక్షేమం, గల్ఫ్ కార్మికుల హక్కులు, బీసీల రాజకీయ సాధికారతకు ఆయన చేసిన కృషిని పరిగణనలోకి తీసుకొని గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని పద్మశాలి, సమస్త బీసీ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు.



