గురుస్వామి మహాపాదయాత్రకు అడుగడుగునా భక్తజన నీరాజనం
మహాపాదయాత్రలో పాల్గొంటున్న స్వాములకు సేవలందిస్తున్న అయ్యప్ప భక్తులు
విశ్వంభర, చేవెళ్ల:శ్రీ ఉమాశంకర్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఐదవ సంవత్సరం అయ్యప్ప మహాపాదయాత్రకు అడుగడుగునా భక్తుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఈ నెల 23వ తేదీన చేవెళ్ల మండలం కందవాడ గ్రామంలోని శ్రీశ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ మహాపాదయాత్రలో గురుస్వామిని కలుసుకునేందుకు వివిధ గ్రామాల నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గురుస్వామి ఆశీస్సులు తీసుకుంటూ, పాదయాత్రలో పాల్గొంటున్న స్వాముల యోగక్షేమాలను తెలుసుకుంటూ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.ఈ క్రమంలో మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం వద్ద మహాపాదయాత్ర బృందం మధ్యాహ్న భిక్ష కార్యక్రమం కోసం విరామం తీసుకుంది. షాబాద్ మండలంలోని నాగర్‌గూడ, కొమరబండ, మాచన్‌పల్లి, హైతాబాద్ గ్రామాలతో పాటు శంకర్‌పల్లి మండలం చేర్యాల గూడెం, చేవెళ్ల మండలం ఊరెళ్ల గ్రామాలకు చెందిన అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని స్వాముల సేవలో పాల్గొన్నారు.
నాగర్‌గూడ వెంకటేష్ గురుస్వామి ఆధ్వర్యంలో భిక్ష
నాగర్‌గూడ గ్రామానికి చెందిన వెంకటేష్ గురుస్వామి మహాపాదయాత్ర బృందానికి మధ్యాహ్న భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాదయాత్రలో పాల్గొంటున్న స్వాములందరూ పాల్గొన్నారు. గత మూడు, నాలుగు రోజులుగా వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివస్తూ గురుస్వామిని కలుసుకోవడం, స్వాముల యోగక్షేమాలను తెలుసుకోవడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషంగా నిలిచింది.



