పుల్లెంలలో వైభవంగా శ్రీ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు....
విశ్వంభర, చండూర్ మండలం:- పుల్లెంల గ్రామంలో శ్రీ భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కనకదుర్గమ్మ 11వ వార్షికోత్సవ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిపారవశ్యంతో కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో మహిళలు తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, పిల్లలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రతి ఇంటా శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని ప్రార్థించారు.భక్తుల జయజయధ్వానాలు, మంగళహారతులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.భక్తి, విశ్వాసం, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న ఈ నవరాత్రి ఉత్సవాలు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతున్నాయి. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.



