ఏట్ల ఎర్రవల్లిలో బొడ్రాయికి 101 బిందెలతో జలాభిషేకం
గ్రామ ప్రజల సుఖసంతోషాలు, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు
జై మాత.. జై జై మాత అంటూ మార్మోగిన గ్రామం
విశ్వంభర, షాబాద్:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని ఏట్ల ఎర్రవల్లి గ్రామంలో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, సిరిసంపదలతో తులతూగాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ గ్రామ దేవత బొడ్రాయికి 101 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు.
దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో శ్రీ భవాని మాలధారణ స్వాములందరూ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. గ్రామంలో సుఖశాంతులు వెల్లివిరియాలని, రైతులకు మంచి పంటలు పండి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించారు.భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గ్రామ దేవత బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ “జై మాత.. జై జై మాత” అంటూ భక్తులు అమ్మవారి నామస్మరణ చేశారు.ఈ కార్యక్రమాన్ని దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భవాని మాలధారణ స్వాములు సమష్టిగా నిర్వహించారు.



