ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం : హరీశ్ రావు

ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం : హరీశ్ రావు

విశ్వంభర, వెడ్ డెస్క్ : ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్  ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు గత బీఆర్ ఎస్ హయాంలో తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను ప్రారంభించామని అయితే వాటిని అధికారంలోకి వచ్చిన ఐదు నెలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూల్చడం బాధాకరం అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ డయాగ్నాస్టిక్ హబ్ లు అన్ని అస్తవ్యస్తంగా మారాయని సిబ్బందికి 6 నెలలుగా జీతాలు రావడం లేదని మీడియాలో వచ్చిన కథనాలను హరీశ్ రావు సోమవారం ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు. 

కేసీఆర్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా 36 డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసి 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. లక్షలాది నిరుపేద, సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్య పరీక్షలను అందించారని గుర్తుచేశారు. అలాంటి డయాగ్నస్టిక్ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపం తో కొట్టుమిట్టాడుతున్నాయని, సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి ఏర్పడిందంటే ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్భనం అని ధ్వజమెత్తారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డయాగ్నస్టిక్ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించి, అన్ని రకాల వైద్య పరీక్షలు, వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.

Read More రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల కొరకే మా పోరాటం:ధర్మ సమాజ్ పార్టీ