రాజకీయ కక్షలకు పాల్పడితే ఊరుకునేది లేదు. - మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి - చండూర్ మున్సిపల్ చైర్మన్ ఇల్లు కూల్చడం రాజకీయ కక్షే
కోమటిరెడ్డి బ్రదర్స్ పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్. - బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయడం సిగ్గుచేటు
On
సొంత పార్టీ ఎమ్మెల్యే లే కాంగ్రెస్ పార్టీ పై అసహనం
విశ్వంభర, చండూరు: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ నాయకులపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలు తీసుకుంటోందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి రెడ్డి ఆరోపించారు. చండూరులో మాజీ మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్నకు చెందిన భవనాన్ని కూల్చివేసిన ఘటనపై గురువారం ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పోరాట జీవితంలో ఎన్నో కేసులను ఎదుర్కొన్న తమకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడే అవసరం లేదన్నారు. ప్రజల్లో తమ ప్రభావం పెరుగుతుండటంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసుల ద్వారా బీఆర్ఎస్ నేతలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలనే కోసమే ఈ చర్యలన్నీ జరుగుతున్నాయన్నారు. జిల్లాలో మంత్రుల పనితీరు ఖండనీయమని, గత బీఆర్ఎస్ హయాంలో మంజూరైన రోడ్ల పనులను ఇప్పుడు మేమే చేయిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. వ్యవసాయ రంగం దండగగా మారిందని, బోనస్ పేరిట ఇచ్చిన హామీలు బోగస్ గా మిగిలిపోయాయని మండిపడ్డారు. నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత రైతులను తీవ్రంగా ఇబ్బందులలోకి నెట్టిందని తెలిపారు. మంత్రులు మరియు అధికారుల్లో కమిషన్ల కోసమే పోటీ జరుగుతోందని, వడ్లు కొనే వ్యవస్థలో సైతం కమిషన్లు వసూలు అవుతున్నాయన్నారు. పోలీస్ శాఖ అక్రమ కేసుల ద్వారా ప్రజల నుంచి వసూలు చేస్తోందని ఆరోపించారు. నీటిపారుదల శాఖ మంత్రి ప్రాజెక్టులపై అవగాహన లేకపోవడం వల్ల గోదావరి నీళ్లు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే ప్రమాదం ఏర్పడిందన్నారు. కేంద్రంగా ఉన్న అభివృద్ధి అంశాలపై దృష్టి పెట్టకుండా, మంత్రులు, ముఖ్యమంత్రి వరకు కేవలం కేసీఆర్ ను తిట్టటమే ప్రధానంగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్ర రైతులకు ఇంకా రూ.17 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, రుణమాఫీ కేవలం 30 శాతమే జరిగిందన్నారు. ఉద్యోగుల బదిలీలకు డబ్బులు వసూలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరక్తి పెరిగిందని, రాబోయే ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి, రెగట్ట మల్లికార్జున్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం, కోడి వెంకన్న, కొత్తపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు.



