గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు
- జిల్లా కలెక్టర్ హైమావతి
విశ్వంభర, సిద్దిపేట: జిల్లాలోని అన్ని ప్రభుత్వ మాతా-శిశు ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, గర్భిణులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం పొందాలని జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక-99రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో బుధవారం నిర్వహించిన “సేఫ్ మదర్ డే”కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 6నుంచి 11వరకు హెల్త్ వీక్‌గా నిర్వహిస్తూ రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. గర్భధారణ ప్రారంభం నుంచి శిశువు జననం వరకు తల్లి-శిశువుల ఆరోగ్యాన్ని కాపాడడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. గర్భిణులు వైద్యుల సూచనలు పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవడం, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం ముఖ్యమని తెలిపారు. గర్భధారణ నిర్ధారణ కాగానే సమీప ఆరోగ్య కేంద్రానికి సమాచారమివ్వాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయని 7వ, 8వ, 9వ నెలల్లో తప్పనిసరిగా పరీక్షలు చేయించుకుని, ప్రసవం కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేయించుకోవాలని సూచించారు. గర్భిణుల ఆరోగ్యానికి భర్తలు, కుటుంబ సభ్యుల సహకారం అవసరమన్నారు. అనంతరం డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రిస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌లో కుటుంబసమస్యలతో సతమతమవుతూ డిప్రెషన్‌కి గురైన ఓ రోగితో మాట్లాడారు. జీవితం చాలా గొప్పదని, కష్టసుఖాలు ఎదుర్కొని జీవితంలో నిలదొక్కోవాలని సూచించారు. మానసికంగా దృఢంగా ఉండాలని సమస్యలకు తలగ్గొద్దని, చదువుతో పాటు మంచి అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. మానసిక వైద్య నిపుణులు తెలిపిన ప్రతిదీ పాటిస్తూ ఉన్నత స్థానానికి ఎదగాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్, సైకియాట్రి విభాగం హెచ్‌వోడీ డాక్టర్ శాంతి, ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బాబ్జి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మహేందర్ రెడ్డి, నర్సింగ్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



