సమాజ అభివృద్ధిలో ప్రతి మహిళ భాగస్వామ్యం కావాలి. - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి
-అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలు
విశ్వంభర, హైదరాబాద్ : ప్రతి మహిళా ఇంటికే పరిమితం కాకుండా సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య పేర్కొన్నారు. మహిళా సేన ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జయ ఇంటర్నేషనల్ హోటల్‌లో జూన్ 22-24 తేదీల్లో నిర్వహించిన మహిళా సాధికారత ఎగ్జిబిషన్‌లో వివిధ రంగాలకు చెందిన మహిళలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించారు. కావ్య కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి మహిళ లో ఏదో ఒక టాలెంట్ ఉంటుందని అలాంటి టాలెంట్ ను ఇలాంటి వేదికల ద్వారా నిరూపించుకునే మంచి అవకాశం ఉంటుందని అన్నారు. మహిళ సాధికారత కోసం, మహిళ అభ్యున్నతికి బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో తోడ్పాటు అందిస్తుందని అన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా తాను కూడ మహిళ ల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నాని అన్నారు. మహిళల అభివృద్ధి ద్వారానే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమని, ఆ బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. మహిళల విజయాలు, పోరాటాలు, స్ఫూర్తిదాయక కథలు ప్రతి రంగంలోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు.మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా సమాజం ముందుకు సాగుతుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని అన్నారు. నిర్వాహకులు సంధ్య, కవిత లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకుడు వేణుగోపాల చారి, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కృష్ణమోహన్, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.



