భద్రాచల రామాలయం సమీపంలో చెత్త పొగతో భక్తులు, స్థానికులు ఇబ్బందులు.

భద్రాచల రామాలయం సమీపంలో చెత్త పొగతో భక్తులు, స్థానికులు ఇబ్బందులు.

విశ్వంభర, భద్రాచలం : పుణ్యక్షేత్రమైన భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి కూతవేటు దూరంలో రోజూ కలుగుతున్న చెత్త పొగ వల్ల భక్తులు, పరిసర కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయ ప్రాంగణానికి దగ్గరగా ఉన్న కరకట్టపై చెత్తను పేరుకుపోయేలా వేసి తరచూ తగలపెడుతున్నారు. దీని వల్ల దట్టమైన పొగ ఏర్పడి చుట్టుపక్కల ప్రాంతమంతా పొగమంచుతో నిండిపోయినట్టుగామారుతోంది. ఈ చెత్త దహనం వల్ల వచ్చే పొగ, గాలిలో కలిసిన అశుద్ధత భక్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశం నలుమూలల నుండి వచ్చేవారు పవిత్ర దర్శనం కోసం భద్రాచలం వస్తుంటే, రామాలయ సమీపంలోనే వ్యర్థాల దహనం వల్ల ఏర్పడుతున్న ఈ దుర్వాసన, కాలుష్యం భద్రతా ప్రమాణాలను లঙ্ঘిస్తున్నదిగా వారుపేర్కొన్నారు."ప్రతీ రోజు సాయంత్రం సమయంలో చెత్తను తగలపెడుతుండటంతో, పొగమయం కావడం మాకు రోజువారీ సమస్యగా మారింది. ఎన్నిసార్లు గ్రామపంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు" అని పరిసర కాలనీవాసులు పేర్కొంటున్నారు. "సీతారాముల వారికి రోజూ శాస్త్రోక్తంగా ఇచ్చే ధూపంతో పాటు, ఇప్పుడు ఈ చెత్త పొగ కూడా నిత్యదూపంలా మారింది. ఇది భక్తికి అవమానంగా భావించాలి" అని ఒక స్థానిక భక్తుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సంబంధిత గ్రామపంచాయతీ అధికారులు, మున్సిపల్ శాఖలు, భద్రాచలం దేవస్థాన పాలకులు తక్షణం స్పందించి పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు, భక్తులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags: