వ్యాపారవేత్తలుగా ఎదగాలి: కలెక్టర్
విశ్వంభర, భూపాలపల్లి : వ్యాపార ఏర్పాటుకు అనేక అవకాశాలు ఉన్నాయని, ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని వ్యాపారవేత్తలుగా ఎదగాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. బుధవారం రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో డిఆర్డిఏ, కృషి విజ్ఞాన్ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ఉన్నతి ప్రాజెక్ట్ కింద పాడి పరిశ్రమ, వర్మికంపోస్ట్, ఆక్వాకల్చర్ ఏర్పాటు తదితర యూనిట్లు ఏర్పాటుపై మహిళా స్వయం సహాయక సంఘాలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయానికి అనుబంధంగా పశువుల పెంపకం చేపట్టడం ద్వారా అధిక ఆదాయం సమకూరుతుందని తెలిపారు. గ్రామీణ ప్రజలు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థికాభివృద్ధికి పశుసంపద ప్రధాన భూమికని అన్నారు. డిఆర్డీఏ ద్వారా మహిళా సంఘాల ఉపాధికి అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పెట్టుబడులకు నిధులు డిఆర్డీఏ సహకారం అందిస్తున్నామని తెలిపారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ఉపాధి కల్పన లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఆర్డిఓ నరేష్, వరంగల్ కృషి విజ్ఞాన్ కేంద్రం శాస్త్రవేత్త డా సాయి కిరణ్, ఏపీడీలు గోవిందరావు, మంజుల, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, డిపిఎంలు రవి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.



