ఫోన్ ట్యాపింగ్ లో బిగ్ అప్డేట్... 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు వెల్లడి
విశ్వంభర, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ లో కీలక పరిమాణం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎస్ ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వాంగ్మూలంలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు అంగీకరించారు. ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టామని, వారికి వెళ్లే డబ్బును అడ్డగించి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నేతలు, జడ్జిలు, స్థిరాస్తి వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు అంగీకరించారు. కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సాఫ్ట్వేర్ సహాయంతో ట్యాపింగ్ కు పాల్పడినట్లు తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ పర్యవేక్షణ కోసం 17 కంప్యూటర్లను వినియోగించామని, 56 మంది ఎస్ వోటీ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభాకర్ రావు నుంచి ట్యాపింగ్ ఆపేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. ఆయన రాజీనామా చేసే ముందు రికార్డులన్నీ ధ్వంసం చేయాలని సూచించినట్లు తెలిపారు. రికార్డులు ధ్వంసం చేసి కొత్తవాటిని అమర్చామని పేర్కొన్నారు. ధ్వంసం చేసిన ఆధారాలను నాగోలు, మూసారాంబాగ్ వద్ద మూసీ నదిలో పడేసిట్లు వెల్లడించారు. సీడీఆర్, ఐడీపీఆర్ డేటా మొత్తం కాల్చేసినట్లు పేర్కొన్నారు. ఫార్మాట్ చేసిన ఫోన్లు, పెన్ డ్రైవ్ లను బేగంపేట నాలాలో పడేసినట్లు తెలిపారు