భద్రాచలం శ్రీమన్నారాయణ ఆచార్యులకూ ఘనసత్కారం - భద్రాచల దేవస్థాన సంస్కృత పండితునికి మూడు విశ్వవిద్యాలయాల నుంచి ప్రాచ్య విద్య విభూషణం పురస్కారం

భద్రాచలం శ్రీమన్నారాయణ ఆచార్యులకూ ఘనసత్కారం - భద్రాచల దేవస్థాన సంస్కృత పండితునికి మూడు విశ్వవిద్యాలయాల నుంచి ప్రాచ్య విద్య విభూషణం పురస్కారం

విశ్వంభర, భద్రాచలం:  భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో సంస్కృత పండితుడిగా, అర్చక స్వామిగా, వేదపండితులకు, విద్యార్థులకు గురువుగా పదేళ్లుగా విశిష్ట సేవలందిస్తున్న ఎస్.టి.జి. శ్రీమన్నారాయణ ఆచార్యులకు ఇటీవల మూడు ప్రముఖ సంస్కృత విశ్వవిద్యాలయాల నుంచి "ప్రాచ్య విద్య విభూషణం" పురస్కారం లభించింది. ఈ సందర్భంగా భద్రాచల దేవస్థానం మరియు దేవస్థానం ఉద్యోగ సంఘం వారి సత్కారార్థంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దేవస్థాన కార్యనిర్వహణ అధికారి రమాదేవి అధ్యక్షత వహించారు. మంగళవాయిద్యాల నినాదాలతో గురువుగారు దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చక స్వాములు ప్రత్యేక తిరుపరివట్టాన్ని సమర్పించి వేదాశీర్వచనాలు అందజేశారు. అనంతరం జరిగిన సభలో గురువుగారి సేవలను ప్రశంసిస్తూ పలువురు అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా దేవస్థానం ఏఈవోలు శ్రవణ్ కుమార్, భవాని రామకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు మాట్లాడారు. గురువుగారి నిష్ఠ, శ్రద్ధ, భాషాపట్ల ప్రేమను ప్రశంసిస్తూ, భద్రాచలం వంటి పవిత్రస్థలంలో ఇంత గొప్ప పాఠశాల గురువు అందరికీ ఆదర్శంగా నిలుస్తారని వ్యాఖ్యానించారు. ప్రధాన అర్చకులు, వేద పండితులు, గురువుగారి వద్ద విద్యాభ్యసించిన విద్యార్థులు మాట్లాడుతూ — శ్రీమన్నారాయణ ఆచార్యుల వద్ద విద్యనభ్యసించడం తమ జీవితానికి దిశానిర్దేశం చేసిన భాగ్యంగా భావిస్తున్నామని, ఆయన పాఠాలు తమ జీవితంలో మార్గదర్శిగా నిలిచాయని ఆనందం వ్యక్తం చేశారు. గురువు దశాబ్దాలుగా సాగించిన సేవను గుర్తించి, దేశవ్యాప్తంగా ఉన్న సంస్కృత విశ్వవిద్యాలయాలు వీరిని పురస్కరించడమంటే ఇది భద్రాచలానికి గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ శ్రేణిలో మరిన్ని గౌరవాలు వీరికి లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకవర్గం, ఉద్యోగ సంఘం ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు, స్థానిక భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.WhatsApp Image 2025-06-21 at 6.09.14 PM
 

Tags: