భద్రాచలం శ్రీరామాలయంలో నిత్యకల్యాణ సేవకు భక్తుల తాకిడి
On
విశ్వంభర, భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రతి రోజూ నిర్వహించబడుతున్న నిత్యకల్యాణ మహోత్సవంకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా శనివారాలు మరియు ఆదివారాలలో భక్తుల రాకపోకలు గణనీయంగా పెరుగుతున్నాయి.ఈ రెండు రోజుల్లో వేలాది మంది భక్తులు పలు ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చి రాముల వారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు తరలివస్తున్నారు. తెల్లవారుజామున నుంచే భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకొని, గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, కళ్యాణం దర్శించుకుంటున్నారు. భక్తుల సంఖ్య పెరగడాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆలయ నిర్వహణాధికారి శ్రీమతి ఎల్. రమాదేవి గారి నాయకత్వంలో ఆలయ సిబ్బంది పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు క్రింది విధంగా ఏర్పాట్లు చేశారు:క్రమబద్ధమైన క్యూలైన్లు,ఉచిత తాగునీటి సౌకర్యం,అన్నదాన ఏర్పాట్లు, శుభ్రతకు ప్రత్యేక శ్రద్ధ,వృద్ధులు, స్త్రీలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. నిత్యకల్యాణంలో భాగంగా పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య సీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయ సంప్రదాయం ప్రకారం ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. కల్యాణోత్సవం అనంతరం తీర్థప్రసాదాలు అందించబడుతున్నాయి.తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా,మహారాష్ట్రల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున భద్రాచలం రామాలయానికి వచ్చి దర్శనం పొందుతున్నారు. ఫలితంగా పట్టణం మొత్తం భక్తి శ్రద్ధలతో నిండిపోతుంది.




