నిరుద్యోగ యువత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
విశ్వంభర, గుండాల: గుండాల మండలంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను విస్తరించే లక్ష్యంతో నైపుణ్యాభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి శ్రీమతి చండీరాణి తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాలు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖతో పాటు ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, బీసీ సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అమలు చేయబడుతున్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా వేర్‌హౌస్ క్లెయిమ్స్ కోఆర్డినేటర్, కన్వీనర్ ఎగ్జిక్యూటివ్, డొమెస్టిక్ ఐటీ హెల్ప్ డెస్క్ అటెండెంట్, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ అసెంబ్లీ ఆపరేటర్, మల్టీ స్కిల్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్, ఎంట్రప్రెన్యూర్షిప్ కమ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం , స్వయం ఉపాధి టైలరింగ్ వంటి పలు రంగాల్లో శిక్షణ అందించబడుతుంది. ఈ శిక్షణలకు కనీస అర్హతగా 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు సాధారణంగా 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. సంబంధిత శాఖల నిబంధనల ప్రకారం అర్హతల్లో మార్పులు ఉండవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో గుండాల మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో సూచించారు. ఈ శిక్షణలు పూర్తిగా ఉచితంగా అందించబడతాయని, శిక్షణ అనంతరం అభ్యర్థులకు ఉపాధి అవకాశాలపై మార్గదర్శకత్వం, అవసరమైన సహాయం కూడా కల్పించబడుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు గుండాల మండల పరిషత్ కార్యాలయాన్ని సంప్రదించగలరని తెలిపారు



