ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
On
విశ్వంభర, భద్రాచలం : ప్రాచీన కాలం నుంచి భారతీయుల ఆరోగ్య రహస్యంగా నిలిచిన యోగాసనాలు, ఇప్పుడున్న ప్రపంచానికి అమూల్యమైన సంపదగా నిలిచాయని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు. యోగాలోని విశిష్టతలను గుర్తించిన ప్రపంచ దేశాలు కూడా దీనిని ఆచరిస్తూ లాభాలను పొందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. శనివారం ఉదయం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన జానపద మ్యూజియంలో, యోగా గురువు గుమలాపురం సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు, ఐటీడీఏ అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ సిబ్బంది, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బి. రాహుల్ మాట్లాడుతూ –“ప్రతి రోజు నిర్వహించే అనేక పనుల్లో యోగాసనాన్ని ఒక నిత్య కృత్యంగా చేసుకుంటే మనశ్శాంతి లభిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గి మెదడుకు శక్తి చేకూరుతుంది. శరీరంలోని జీవన క్రియలు మెరుగవుతాయి. రోగ నిరోధక శక్తి పెరిగి అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. శ్వాసక్రియ బాగుపడుతుంది. ఈ విధంగా యోగా శరీరం మొత్తం ఉత్తమంగా పనిచేసేందుకు దోహదపడుతుంది.
గిరిజన సంక్షేమ శాఖలో పనిచేసే హెచ్ఎంలు, వార్డెన్లు, ఉపాధ్యాయులు యోగాసనాల ప్రధానతను విద్యార్థులకు బోధించి ప్రతిరోజూ సాధన చేయించే విధంగా కృషి చేయాలి,” అని అన్నారు.శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు మాట్లాడుతూ –
“యోగాసనాలు కేవలం శారీరక కదలికలు కాదు. ఇవి మానసిక ఆరోగ్యానికి మార్గదర్శకాలు. ప్రతి రోజు యోగా సాధన చేస్తే మనలో ఉత్తేజం పెరుగుతుంది. ఇది ఆధ్యాత్మికంగా, భావోద్వేగపరంగా వ్యక్తిని సమతుల్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాయామాల వల్ల మానసిక ఒత్తిడిని దూరం చేయగలగడం ఈ యోగపద్ధతుల ప్రత్యేకత,” అని చెప్పారు.యోగ గురువు గుమలాపురం సత్యనారాయణ మాట్లాడుతూ –“ఆరోగ్యంగా లేని మనిషి జీవితంలో ఏదీ సాధించలేడు. శాంతియుత మనస్సు ఉన్న వారే జీవితంలో విజయాలు సాధించగలరు. యోగా అనేది మనస్సు, శరీరం, ఆత్మను ఏకం చేసే మహోన్నత సాధన. పాఠశాల విద్యార్థులు ప్రతిరోజూ యోగ సాధన చేస్తే వారి మేధాశక్తి, నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది,” అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో పలు యోగ భంగిమలు ప్రదర్శించి, వాటి ప్రయోజనాలు వివరించారు. అనంతరం భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావును, యోగా గురువు గుమలాపురం సత్యనారాయణను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఏఒ సున్నం రాంబాబు, ఎస్ ఓ భాస్కరన్, ఏ టి డి ఓ అశోక్ కుమార్, క్రీడా శాఖ అధికారి గోపాలరావు, జి సి డి ఓ అలివేలు మంగతాయారు, ఐటీడీఏ కార్యాలయ సిబ్బంది, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,



