బీఆర్ఎస్‌లో మిగిలేది కేసీఆర్ కుటుంబమే: తీన్మార్ మల్లన్న

బీఆర్ఎస్‌లో మిగిలేది కేసీఆర్ కుటుంబమే: తీన్మార్ మల్లన్న

కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారం జోరుగా చేస్తున్నారు. గెలుపు అవకాశాలు  ఎక్కువగా ఉన్నా.. ఏ మాత్రం ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ప్రచారం చేస్తున్నారు. అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నారు. కమ్యూనిస్టులు ఇప్పటికే మల్లన్నకు మద్దతు పలికారు. ఇవాళ సీపీఎస్ ఉద్యోగులు కూడా మల్లన్న వైపే మొగ్గు చూపారు. కాగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డారు. 

రాజీనామా చేసిన స్థానం నుంచి బీఆర్ఎస్ మళ్లీ ఎందుకు పోటీ చేస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పోటీ చేయాలనుకున్నపుడు ఎందుకు రాజీనామా చేశారని ప్రశ్నించారు. ఉద్యోగులకు కానీ.. నిరుద్యోగులకు కానీ.. బీఆర్ఎస్ హయాంలో గౌరవం లేదని అన్నారు. విద్యార్థులను, నిరుద్యోగులను అసలు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఉస్మానియా, జేఎన్టీయూ, కాకతీయ విద్యార్థులను కేటీఆర్ ఘోరంగా అవమానించారని విమర్శించారు. 

Read More ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

కాబట్టి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు తగిన బుద్ధి చెప్పాలని గ్రాడ్యుయేట్స్‌కు తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ చరిత్రలో కలిసిపోయినట్టేనని అన్నారు. ఆ పార్టీకి ఇంకా భవిష్యత్ లేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయమని మల్లన్న జోస్యం చెప్పారు. ఆ పార్టీలో కల్వకుంట్ల కుటుంబం తప్పా మిగిలిన వారంతా వేరే దారి చూసుకుంటారని చెప్పారు. ఇక కల్వకుంట్ల కుటుంబం కూడా తెలంగాణలో ఉండదని.. జైలుకు వెళ్లిపోతుందని మల్లన్న అన్నారు. మల్లన్న కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

Related Posts