వీధి కుక్క కరిస్తే సర్కార్‌దే బాధ్యత 

రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక

వీధి కుక్క కరిస్తే సర్కార్‌దే బాధ్యత 

దేశంలో నానాటికీ పెరుగుతున్న వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు మరోసారి విరుచుకుపడింది. వీధి కుక్కల బెడదను అరికట్టడంలో విఫలమైతే రాష్ట్ర ప్రభుత్వాలపై భారీ జరిమానాలు విధిస్తామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశంలో నానాటికీ పెరుగుతున్న వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు మరోసారి విరుచుకుపడింది. వీధి కుక్కల బెడదను అరికట్టడంలో విఫలమైతే రాష్ట్ర ప్రభుత్వాలపై భారీ జరిమానాలు విధిస్తామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కుక్క కాటుకు గురైన ప్రతి వ్యక్తికీ పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని తేల్చిచెప్పింది. మంగళవారం ఈ అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం, కుక్కలకు ఆహారం పెట్టే జంతు ప్రేమికుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. "మీకు కుక్కల మీద అంత ప్రేమ ఉంటే.. వాటిని మీ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోండి. మీ భావోద్వేగాలు కేవలం కుక్కలకేనా? మనుషుల గురించి పట్టదా?" అని కోర్టు ప్రశ్నించింది. కుక్క కరిచిన ప్రభావం బాధితులపై జీవితకాలం ఉంటుందని, ముఖ్యంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోతుంటే చూస్తూ ఊరుకోలేమని పేర్కొంది.

ఏదైనా సంస్థ ఆహారం పెడుతున్న కుక్క దాడిలో చిన్నారి మరణిస్తే, ఆ సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుందని, కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోకపోతే, కోర్టు నిర్దేశించిన భారీ పరిహారాన్ని బాధితులకు చెల్లించాల్సి వస్తుందని పేర్కొంది. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, క్రీడా ప్రాంగణాల వద్ద తిరిగే కుక్కలను వెంటనే షెల్టర్లకు తరలించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను కోర్టు గుర్తు చేసింది. వీధుల వెంబడి కుక్కలు తిరుగుతూ ప్రజలను భయపెట్టే పరిస్థితిని తాము ఆమోదించబోమని న్యాయస్థానం స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

Read More  Maoists: మావోయిస్టులకు మరో బిగ్ షాక్..!!