BREAKING: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు సునీల్‌ ఛెత్రి గుడ్‌బై...!

BREAKING: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు సునీల్‌ ఛెత్రి గుడ్‌బై...!

టీమ్ ఇండియా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. చివరిసారిగా జూన్ 6న కువైట్‌తో మ్యాచ్ ఆడనున్నాడు.

రెండు దశాబ్దాలపాటు భారత జట్టుకు సారథిగా ఉన్న టీమ్ ఇండియా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. చివరిసారిగా జూన్ 6న కువైట్‌తో మ్యాచ్ ఆడనున్నాడు. తన నిర్ణయంపై ఓ పోస్ట్‌లో ఛెత్రి భావోద్వేగానికి గురయ్యాడు. రిటైర్మెంట్ గురించి తన తల్లి, భార్యకు చెప్పినప్పుడు కన్నీరు పెట్టుకున్నారని గుర్తు చేసుకున్నాడు. భారత్ తరఫున 2005లో జాతీయ జట్టులోకి అడుగు పెట్టిన ఛెత్రి ఇప్పటి వరకు అంతర్జాతీయ మ్యాచ్‌లో 94 గోల్స్ కొట్టాడు. 

ఇప్పటివరకు 94 గోల్స్‌ (150 మ్యాచ్‌ల్లో) చేసి.. ప్రపంచంలోనే అత్యధిక గోల్స్‌ సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. కెప్టెన్ ఛెత్రి పోస్ట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. ‘19 ఏళ్ల నా కెరీర్‌లో ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా నేను ఇన్నేళ్లపాటు భారత జట్టుకు ఆడతానని అనుకోలేదు. బాధ్యతలు, ఒత్తిడి, అమితమైన ఆనందం.. ఇలా ఎన్నింటినో అనుభవించా. మంచిచెడులు ఉన్నాయి. ప్రతీ క్షణం కష్టపడ్డా. ఇక నేను చివరి మ్యాచ్ ఆడేందుకు సమయం ఆసన్నమైందని అనుకుంటున్నా.’ అని తెలిపాడు. 

Read More వరద బాధితులకు భద్రాచలం దేవస్థానం అన్న ప్రసాదం పంపిణి  

అదేవిధంగా ‘కువైట్‌తో మ్యాచ్ మాకు చాలా అవసరం. తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ కీలకం. జట్టుకు ఎంత ముఖ్యమో వ్యక్తిగతంగా నాకూ గుర్తుండిపోయే మ్యాచ్ అవుతుందని భావిస్తున్నా. నా నిర్ణయం తెలిసి మా అమ్మానాన్న, నా భార్య స్పందన మాటల్లో చెప్పలేను. నేను ఆట ఆడేటప్పుడు వారు చాలా ఒత్తిడికి గురయ్యేవారు. ఇక దేశం తరఫున ఆడటంలేదనే విషయాన్ని వారు తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారని అర్థమైంది. నాలోని చిన్నపిల్లాడు ఫుట్ బాల్ ఆడటం ఆపవద్దని చెబుతున్నాడు. నిజంగా నేను అదృష్టవంతుడిని. కలను నిజం చేసుకోవడంలో విజయవంతమయ్యా" అంటూ ఛెత్రి భావోద్వేగానికి గురయ్యాడు.