మెడికల్ మాఫియా.. సూర్యాపేటలో జోరుగా దందా

మెడికల్ మాఫియా.. సూర్యాపేటలో జోరుగా దందా

వైద్యో నారోయణ హరీ’ అన్న మాటలకు సూర్యాపేట ప్రైవేటు హాస్పిటల్స్ కొత్త అర్ధం చెబుతున్నాయి. ఆపదంటూ వచ్చిన పేషంట్ల నుంచి ముక్కు పిండి డబ్బులను అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు.

విశ్వంభర, నల్లగొండ బ్యూరో: ‘వైద్యో నారోయణ హరీ’ అన్న మాటలకు సూర్యాపేట ప్రైవేటు హాస్పిటల్స్ కొత్త అర్ధం చెబుతున్నాయి. ఆపదంటూ వచ్చిన పేషంట్ల నుంచి ముక్కు పిండి డబ్బులను అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. మాములుగా జ్వరం వచ్చిందని వెళ్లిన వారిని సైతం ప్లేట్ లెట్ కౌంట్ తగ్గిందని, డబుల్ టైఫాయిడ్ అంటూ రకరకాల పేర్లు చెప్పి.. తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ తరహా మెడికల్ మాఫియా దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం..  ప్రైవేటు హాస్పిటల్స్‌కు వెళ్లేలా చేస్తే.. అక్కడికి వెళ్లాక ఇదే అదునుగా యాజమాన్యాలు రూ.లక్షల్లో బిల్లులు వేస్తున్నారు. పైగా వైద్యం సేఫ్‌గా అందుతుందా..? అంటే అదీ లేదు. అర్హత లేని వారితో వైద్యం చేయించడం.. పేషంట్ల ప్రాణాలతో చెలగాటమాడడం సూర్యాపేటలోని ప్రైవేటు హాస్పిటల్స్‌లో నిత్యకృత్యమే. ఇంత జరుగుతున్నా.. నియంత్రించాల్సిన వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలకే వంత పాడుతుండడం గమనార్హం.

పుట్టగొడుగుల్లా ప్రైవేటు హాస్పిటల్స్..

సూర్యాపేట జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు హాస్పిటల్స్ పుట్టుకొచ్చాయి. ఏ గల్లీ చూసినా.. చిన్నపాటి హాస్పిటల్ దర్శనమిస్తుంది. ప్రధానంగా సూర్యాపేట పట్టణంలో మెడికల్ కాలేజీ ఓపెన్ అయ్యాక.. ఈ హాస్పిటల్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. నిజానికి మొదట్నుంచీ సూర్యాపేట పట్టణంలో హాస్పిటల్స్ సంఖ్య కొంచెం ఎక్కువగానే ఉండేది. దీనికి మెడికల్ కాలేజీ తోడవ్వడంతో ప్రైవేటు హాస్పిటల్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. మెడికల్ కాలేజీతో పాటు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, వైద్యులు దుకాణం తరహాలో ప్రైవేటు హాస్పిటల్స్‌ను ఓపెన్ చేశారు. మెడికల్ కాలేజీ, ప్రభుత్వ హాస్పిటల్స్‌లో పనిచేసే వైద్యులు, డిపార్ట్‌మెంట్ హెడ్స్, ప్రొఫెసర్లు.. డ్యూటీ సమయంలోనే వారి ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఓపీ చూడడం.. సర్జరీలు  చేయడం పరిపాటిగా మారింది. అదే సమయంలో ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వచ్చిన వారు గంటల తరబడి వైద్యుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి.

Read More చిన్నారి గుండె ఆపరేషన్ కు ఆర్ధిక సాయం 

ట్రీట్‌మెంట్, మెడికల్, ల్యాబ్ దందా..

సూర్యాపేట చుట్టూ పక్కల గిరిజన తండాలు, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం మెడికల్ మాఫియాకు బాగా కలిసివస్తోంది. ప్రజలను ఆకర్షించేలా క్లీనిక్‌లను ఏర్పాటు చేసి వారి అర్హతకు మించిన వైద్యం చేస్తూ రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. ప్రైవేటు హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా ల్యాబ్, మెడికల్ హాల్ నిర్వహిస్తున్నారు. హాస్పిటల్‌కు వెళ్లిన ప్రతి పేషంటుకు అవసరం లేకున్నా.. రెండుమూడు రకాల పరీక్షలు నిర్వహించి డబ్బులు గుంజడం.. విటమిన్, కాల్షియం తదితర ట్యాబెట్లు, సిరప్‌లు రాయడం పేట వైద్యులకు వెన్నతో పెట్టిన విద్యగా మారుతోంది. చిన్నపాటి క్లినిక్‌లోనూ ఓపీ ఫీజు రూ.300పైమాటే. మరికొంతమంది ప్రైవేటు వ్యక్తులు సొంతంగా క్లీనిక్ ఏర్పాటు చేసి.. ఏరియా హాస్పిటల్, మెడికల్ కాలేజీలో పనిచేసే డాక్టర్లను రప్పిస్తున్నారు. ప్రతి ఓపీకి ఒక లెక్కగట్టి ఇస్తున్నారు. దీంతో వైద్యులు తమ చేతికి మట్టి అంటకుండానే పని జరిగిపోతుండడంతో ఒక వైద్యుడు రెండుమూడు క్లీనిక్‌ల్లో ఓపీలు చూస్తున్నారు.

సెటిల్  చేసుకుంటున్న వైద్యారోగ్యశాఖ..

ప్రైవేటు హాస్పిటల్స్‌లో వైద్యులు బయటి నుంచి వస్తుండడం.. ప్రతి క్షణం అందుబాటులో లేకపోవడంతో కొన్నిసార్లు స్టాఫ్ నర్సు స్థాయి సిబ్బందే వైద్యం అందిస్తున్నారు. ఫోన్లలో సంబంధింత వైద్యులు ఇచ్చే సూచనల ప్రకారం.. స్టాఫ్ ట్రీట్‌మెంట్ చేస్తుంటారు. అలాంటి సమయంలో ఏదైనా ఇష్యూ జరిగితే వైద్యారోగ్యశాఖకు కాసుల పంట పండుతోంది. ఇటీవల గాంధీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి పట్టణంలోని ప్రైవేటు హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ కోసం వెళ్లారు. అక్కడి వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో అతడి కండీషన్ సిరియస్ అయ్యింది. దీంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లారు. తిరిగొచ్చాక సదరు ప్రైవేటు హాస్పిటల్‌పై బాధితుడు వైద్యారోగ్య శాఖకు కంప్లైట్ చేశారు. దీన్ని సాకుగా చూపుతూ వైద్యారోగ్యశాఖ అధికారులు సదరు ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యం నుంచి రూ.3లక్షలు వసూలు చేశారు. కానీ బాధితుడికి మాత్రం నేటికీ న్యాయం జరగకపోవడం గమనార్హం. ఇప్పటికైనా సూర్యాపేట మెడికల్ వ్యవస్థను గాడిన పెడతారా..? లేదో.. వేచిచూడాల్సిందే.