లక్కీడ్రా మోసగాళ్లకు 'సజ్జనార్'వార్నింగ్

లక్కీడ్రా మోసగాళ్లకు 'సజ్జనార్'వార్నింగ్

బెట్టింగ్ యాప్‌ల దందాలపై ఉక్కుపాదం మోపిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సాగుతున్న 'లక్కీడ్రా' మోసాలపై దృష్టి సారించారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: బెట్టింగ్ యాప్‌ల దందాలపై ఉక్కుపాదం మోపిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సాగుతున్న 'లక్కీడ్రా' మోసాలపై దృష్టి సారించారు. కారు ఇస్తాం.. బైక్ ఇస్తాం.. అంటూ అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఇన్ ఫ్లూయెన్సర్లను ఆయన తీవ్రంగా హెచ్చరించారు. శనివారం 'ఎక్స్' వేదికగా ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన కొందరు సోషల్ మీడియా స్టార్లే, ఇప్పుడు రూటు మార్చి లక్కీడ్రాల పేరుతో కొత్త వేషాలు వేస్తున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాల్లో సాగుతున్న ఈ దగాను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

కార్లు, ఖరీదైన బైకులు, డీజే సిస్టమ్స్ బహుమతులుగా ఇస్తామంటూ ప్రచారం చేయడంపై వీసీ సజ్జనార్ మండిపడ్డారు. సామాన్య ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని డబ్బులు వసూలు చేయొద్దని తెలిపారు. సెలబ్రిటీలైనా, సోషల్‌మీడియా స్టార్లయినా సరే.. చట్టం ముందు అందరూ సమానులే అని వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇన్ ఫ్లూయెన్సర్లపై 'ది ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) యాక్ట్, 1978' కింద కేసులు నమోదు చేస్తామని సీపీ స్పష్టం చేశారు. పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజల జేబులు కత్తరిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.

Read More తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారకుడైన

అమాయక ప్రజలు ఇలాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మి మోసపోవద్దని సజ్జనార్ హెచ్చరించారు. ఎవరైనా ఇటువంటి డ్రాల పేరుతో డబ్బులు వసూలు చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచించారు.

Related Posts