బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు

  • ఎమ్మెల్యే మహిాపాల్ రెడ్డి, ఆయన సోదరుల ఇళ్లలో తనిఖీలు 
  • ఏకకాలంలో మూడు చోట్ల సోదాలు

పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ) సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన కుటుంబసభ్యుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని మొత్తం మూడు చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. మహిపాల్ రెడ్డితో పాటు ఆయన బంధువులకు ఉన్న రియల్ ఎస్టేట్స్, మైనింగ్, పలు వ్యాపారాలపై ఈడీ అధికారులు ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది. 

గురువారం తెల్లవారుజామున 4గంటల నుంచి ఈడీ అధికారులు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. కాగా, ఇటీవల అక్రమాలకు పాల్పడుతున్నాడని గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే తన సోదరుడితో కలిసి మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 

Read More జర్నలిస్టు ఇండ్ల దరఖాస్తు పత్రాలు ఆవిష్కరించిన రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి. 

గతంలో లక్షారం గనుల వ్యవహారంలో ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నేతల ఇళ్లలో వరుసగా ఈడీ సోదాలు జరగడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మహిపాల్ రెడ్డి 7091 మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ తరఫున నందీశ్వర్ రెడ్డి పోటీ చేసి ఓటమిని చవిచూశారు.