వైసీపీకి నటుడు అలీ రాజీనామా.. ఇకపై సినిమాల్లోనే ఉంటానంటూ ప్రకటన
వైసీపీకి మరో షాక్ తగిలింది. నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఇకపై ఏ పార్టీలోనూ ఉండబోనని ప్రకటించారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వనని.. మిగిలిన జీవితం మొత్తం సినిమాల్లోనే గడుపుతానంటూ తెలిపారు నటుడు అలీ.
తనకు సినిమా జీవితం ఇచ్చింది రామానాయుడే అని.. ఆయన కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు. ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు టీడీపీలో చేరానని.. ఆ పార్టీలోనే దాదాపు 20 ఏండ్ల వరకు కొనసాగినట్టు తెలిపారు నటుడు అలీ. అనుకోని కారణాల వల్ల వైసీపీలోకి వచ్చినట్టు గుర్తు చేసుకున్నారు.
కానీ సినిమాల్లో ఉన్నా.. రాజకీయాల్లో ఉన్నా ఎవరినీ పల్లెత్తు మాట అనలేదని చెప్పారు. అందరితో కలిసిపోయే స్వభావం తనది అన్నారు నటుడు అలీ. సినిమాల్లోనే ఉంటూ.. ఆ సంపాదనలో తన ట్రస్టు ద్వారా పదిమందికి సాయం చేస్తానని తెలిపారు. సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని.. అంతే తప్ప నిజంగా రాజకీయాలు చేద్దామని రాలేదన్నారు.