పాక్ చొరబాట్ల వేళ అమిత్ షా కీలక భేటీ..
హాజరైన డోభాల్
విశ్వంభర, నేషనల్ బ్యూరోః
‘ఆపరేషన్ సిందూర్’తో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాక్ రెచ్చగొట్టే చర్యలకు దీటుగా బదులిచ్చేందుకు కేంద్రం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అన్ని అత్యవసర వ్యవస్థల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో వరుస భేటీలు జరుగుతున్నాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ బీఎస్‌ఎఫ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సీఐఎస్‌ఎఫ్, హోంశాఖలోని సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. సరిహద్దుల్లో , విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కూడా హాజరయ్యారు. కేంద్రమంత్రి నివాసంలో ఈ భేటీ జరిగింది.చొరబాటు ఘటనలు చోటుచేసుకుంటున్న తరుణంలో పాక్‌తో సరిహద్దు పంచుకుంటున్న ఆయా రాష్ట్రాలు ఇప్పటికే కీలక చర్యలు చేపట్టాయి. మన దేశంలోకి చొరబాటుకు యత్నించిన పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిని పంజాబ్ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్‌కు చెందిన జవాన్లు హతమార్చిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లో 1,037 కిలోమీటర్లున్న పాక్ సరిహద్దును మూసివేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే.. కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మూకశ్మీర్‌లోని సాంబ జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బీఎస్‌ఎఫ్ తిప్పికొట్టింది. కనీసం ఏడుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ నేడు కూడా నియంత్రణ రేఖకు ఆవలివైపు నుంచి భారీస్థాయిలో షెల్లింగ్ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఉరి, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉంది. చాలామంది ప్రజలు ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్నారు.



